logo

కాశీపురంలో ఉపాధి మేత..!

ఉపాధి హామీ పథకంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. నచ్చిన పేర్లతో వాడుకుని పనికి రాకున్నా వచ్చినట్లు చూపి వేతదారుల కష్టాన్ని జేబులో వేసుకుంటున్నారు.

Published : 27 Mar 2023 05:16 IST

క్షేత్ర సహాయకుడి చేతివాటం, పక్కదారి పట్టిన నిధులు
న్యూస్‌టుడే, టెక్కలి, సంతబొమ్మాళి  

ఆరోపిస్తున్న గ్రామస్థులు

ఉపాధి హామీ పథకంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. నచ్చిన పేర్లతో వాడుకుని పనికి రాకున్నా వచ్చినట్లు చూపి వేతదారుల కష్టాన్ని జేబులో వేసుకుంటున్నారు. సంతబొమ్మాళి మండలంలోని కోటపాడు పంచాయతీ కాశీపురంలో వెలుగులోకి వచ్చిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ.    

వెళ్లకున్నా..: కోటపాడు పంచాయతీ పరిధిలో 596 జాబ్‌కార్డులున్నాయి. 2019-20లో రూ.82.82 లక్షల విలువైన పనులు జరిగాయి. 2020-21లో రూ.89.44 లక్షలు, 2021-22లో రూ.74.49 లక్షలు వేతనాల రూపంలో చెల్లించారు. పనికి వెళ్లని.. గ్రామం వెలుపల ఉన్న వారి పేరిట మస్తర్లు నమోదవుతున్నాయి. దీంతో పనికి వెళ్తున్నవారి వేతనాలు తగ్గిపోతున్నాయి. పనిలోకి రాని వారికి కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని క్షేత్ర సహాయకుడు తీసుకుంటున్నాడని వేతనదారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పని కల్పించాలంటే వేతనదారుల నుంచి వారానికి రూ.200 ప్రతి శనివారం మధ్యాహ్నం క్షేత్రసహాయకుడి అనుచరుడు వసూలు చేస్తారని, అలా ఇచ్చినవారికే మస్తర్లు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం క్షేత్ర సహాయకుడిగా పని చేస్తున్న వ్యక్తి గతంలో రెండుసార్లు అవినీతి ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యాడని, మళ్లీ అతనికే అధికారులు అవకాశం కల్పించడంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.

లమ్మత కృష్ణారావు మూడేళ్లుగా పనికిరాకపోయినా వెళ్లినట్లు మస్తర్‌లో నమోదైన దృశ్యం


నా పేరు లమ్మత కృష్ణారావు. మాది కాశీపురం. మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు పడిపోవడంతో మక్క జారిపోయింది. మంచం నుంచి కిందకు దిగాలంటే మరొకరి సాయం అవసరం. నేను ఉపాధి హామీ పనికి వెళ్తున్నట్లు మస్తర్‌ వేస్తున్నారు. వచ్చిన వేతనాన్ని వసూలు చేసుకొనే పద్ధతిలో ఇప్పటివరకు రూ.రెండు వేలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడే తీసుకున్నాడు.


నా పేరు అట్టాడ అప్పమ్మ. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా. మూడేళ్లుగా ఉపాధి హామీ పనులకు వెళ్లడం లేదు. మస్తర్‌లో మాత్రం నా పేరు రాస్తున్నారు. నావద్దకు వచ్చి వేలిముద్ర వేయించుకునేటప్పుడు ప్రతిసారీ రూ.50 ఇస్తున్నారు.


నా పేరు లమ్మత నాగరత్నం. మా ఇద్దరు కుమారుల్లో ఒకరు అమెరికాలో స్థిరపడ్డారు. మరొకరు హైదరాబాద్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు. కుమార్తె కూడా అక్కడే స్థిరపడ్డారు. గ్రామంలో 12 ఎకరాల వరకు పొలం ఉంది. భార్యాభర్తలం ఏరోజూ సొంత పొలానికే పనికివెళ్లం. మేమిద్దరం ఉపాధి పనికి వెళ్తున్నామని మస్తర్‌లో మా పేర్లు రాస్తున్నారు. ఇటీవల నా భర్త పేరిట రూ.10 వేలు, నా పేరిట రూ.6 వేలు వచ్చాయి. ఆ మొత్తం మస్తర్లు వేసిన వారికే చేరింది.


గ్రామానికి చెందిన మురపాల అప్పారావు నెల రోజుల క్రితం వరకు దుబాయిలో ఉండేవారు. రెండేళ్లుగా ఆయన పేరు మస్తర్‌లో నమోదైంది.


విచారించి చర్యలు: కాశీపురంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై పంచాయతీ కేంద్రం కోటపాడులో గ్రామసభ నిర్వహిస్తే కాశీపురం గ్రామస్థులెవరూ హాజరుకాలేదు. కాశీపురంలో గ్రామసభ నిర్వహించాలని కోరారు. అక్కడ విచారించి చర్యలు తీసుకుంటాం.

జి.ఉమాసుందరి, ఎంపీడీవో, సంతబొమ్మాళి


పనికి వెళ్లలేదు: నా కుమారుడు రాజాంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కూడా అక్కడే ఉంటోంది. మార్చి 19 వరకు వారిద్దరి పేర్లు మస్తర్‌లో నమోదయ్యాయి.  

మార్పు అప్పారావు, గ్రామస్థుడు


ప్రజాధనం దుర్వినియోగం: 2022లో ఒక్కరోజూ నేను పనికి వెళ్లలేదు. వారానికి రూ.200 ఇస్తే రూ.ఎనిమిది వేల వరకు నా పేరిట వేతనం మంజూరైంది.  

మార్పు భీమారావు, గ్రామస్థుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని