logo

కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన

ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది.

Updated : 29 Mar 2024 05:21 IST

కొత్తవి రావు.. అద్దెవే దిక్కు
జిల్లాలోని ఆర్టీసీ తీరు

కాలం తీరినా ఇంకా తిప్పుతున్న బస్సు

న్యూస్‌టుడే, అరసవల్లి: ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. ఏ క్షణాన ఏ చోట బస్సు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి. అయినా సరే వాటిని రోడ్లపైనే తిప్పుతున్నారు. 15 లక్షల కిలోమీటర్లు తిరిగితే నిలిపివేయాల్సి ఉంది. జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో అలాంటివి చాలావరకు ఉండగా వినియోగంలోనే ఉంచుతున్నారు. ఇటీవల కాలంలో పల్లెవెలుగు పేరుతో గ్రామీణ ప్రాంతాలకు తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సొంతవి సమకూర్చుకోలేక అద్దె బస్సులతో గడిపేస్తున్నారు.  

వేధిస్తున్న మెకానిక్‌ల కొరత..

కొత్త బస్సులు అందుబాటులో లేవు సరికదా ఉన్నవాటిని మెరుగైన కండీషన్లో ఉంచేందుకు మెకానిక్‌లు అవసరం. కాని జిల్లాలో పరిధిలో ఉన్న డిపోల్లో ఎక్కడా సరిపడా మెకానిక్‌లు లేరు. పొరుగుసేవల విధానంలో తీసుకున్నప్పటికీ చాలావరకు ఖాళీలున్నాయి. వాహనాలకు మరమ్మతులు చేసినప్పటికీ కాలం చెల్లిపోవడంతో ఎక్కడికక్కడే మొరాయిస్తూనే ఉన్నాయి. ఒక మెకానిక్‌ రోజుకు 4 బస్సుల వరకు కండీషన్‌ను పరిశీలించి మరమ్మతులు చేయాలి. ఆరింటికి పైగా మరమ్మతులు చేయడంతో ఒత్తిడికు గురవుతున్నారు. నిపుణులైన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. సిబ్బంది పనిచేసేందుకు అవసరమైన పనిముట్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. కొన్ని బస్సులకు ఆకస్మికంగా మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో కొత్త పరికరం వేయాల్సి ఉంటుంది. ఇవి స్థానికంగా లభ్యంకాకపోవడం మరో సమస్యగా మారింది.  

ఇటీవల జరిగిన ఘటనలిలా..

ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. విశాఖ నగర పరిధిలో శ్రీకాకుళం - విశాఖ నాన్‌స్టాప్‌ బస్సు నిలిచిపోయింది. ప్రయాణికులు అసహనం వ్యక్తం చేయడంతో వేరే బస్సులో వారందరినీ శ్రీకాకుళం తీసుకొచ్చారు.  శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్లే నాన్‌స్టాప్‌ బస్సు ఎచ్చెర్ల దాటాక ఆకస్మికంగా ఆగిపోయింది. పల్లెవెలుగు బస్సులు చాలాచోట్ల మొరాయిస్తూనే ఉన్నాయి.  

కండీషన్‌లో ఉండే బస్సులే నడుపుతున్నాం..

జిల్లాలో ప్రతి డిపోకు పదిచొప్పున కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపారు. ఇంకా మంజూరు కాలేదు. ప్రస్తుతానికి మంచి కండీషన్లో ఉన్నవాటినే డ్రైవర్లకు ఇస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.  

ఎ.విజయ్‌కుమార్‌, జిల్లా ప్రజారవాణాధికారి, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని