logo

రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు టీఎన్‌సీసీ అండ

మేకెదాటులో ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలకు ఉండగా ఉంటామని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తెలిపారు.

Updated : 03 Jun 2023 06:29 IST

కేఎస్‌ అళగిరి

చెన్నై, న్యూస్‌టుడే: మేకెదాటులో ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలకు ఉండగా ఉంటామని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో... కావేరి నదిపై మేకెదాటులో ఆనకట్ట నిర్మించనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టీఎన్‌సీసీని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఆనకట్ట నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకుంటే తాము అడ్డుకుంటామని ఆవేశంగా మాట్లాడారని పేర్కొన్నారు. మేకెదాటులో ఆనకట్ట నిర్మాణ ప్రయత్నాలు పదేళ్లుగా జరుగుతున్నాయని తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వానికి 2017లో కేంద్ర జలవనరుల కమిషన్‌ అనుమతి ఇచ్చిందన్నారు. తర్వాత ఈ నివేదికను విధానపరంగా స్వీకరిస్తున్నట్టు కూడా ఆమోదించిందని పేర్కొన్నారు. దానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడాన్ని, సుప్రీంకోర్టులో ధిక్కారణ పిటిషన్‌ దాఖలు చేయడాన్ని అన్నామలై కాదనగలరా? అని ప్రశ్నించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై ఉన్నప్పుడు మేకెదాటు ఆనకట్ట నిర్మాణ ప్రాజెక్టు నివేదిక రూపలకల్పనకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారని, అప్పట్లో అన్నామలై ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకుంటానని ఇప్పుడు చెబుతున్న ఆయన అప్పట్లో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇది రాజకీయ సందర్భవాద చర్యలని విమర్శించారు. కర్ణాటకలో ఎవరు అధికారంలో ఉన్నా మేకెదాటు ఆనకట్ట నిర్మాణ చర్యలకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం చేపట్టే ప్రయత్నాలకు టీఎన్‌సీసీ అండగా ఉంటుందని తెలిపారు.

వేగవంతం చేయాలి: వైగో

విల్లివాక్కం, న్యూస్‌టుడే: మేకెదాటు విషయంలో పెండింగ్‌లో ఉన్న కేసును రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ మేకెదాటు డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పడం ఖండించదగిన విషయమని అసహనం వ్యక్తం చేశారు. కావేరికి అడ్డంగా డ్యాం నిర్మిస్తే రాష్ట్రానికి చుక్క నీరు కూడా రాదని వాపోయారు. 2018 ఫిబ్రవరి 16 తేదీ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 177.25 టీఎంసీల నీరు రావని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలోని కేసును రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని వైగో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని