logo

సెంజి మస్తాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌

కల్తీ మద్యం విక్రయాలకు మంత్రి సెంజి మస్తాన్‌ సహకరిస్తున్నారని, ఆయనను పదవి నుంచి తప్పించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్‌ చేశారు.

Published : 07 Jun 2023 00:59 IST

సైదాపేట, న్యూస్‌టుడే: కల్తీ మద్యం విక్రయాలకు మంత్రి సెంజి మస్తాన్‌ సహకరిస్తున్నారని, ఆయనను పదవి నుంచి తప్పించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... ప్రజలు తమకు ఏదైనా కష్టం అంటే ప్రభుత్వం దగ్గరో, పాలకుల దగ్గరో మొరపెట్టుకుంటారని, అయితే ప్రభుత్వం నిర్వహించే సంస్థలోనే తప్పులు జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. రెండేళ్ల డీఎంకే పాలనలో టాస్మాక్‌ సంస్థలో దుకాణాలు, బార్లలో జరిగే అవినీతి ప్రజలకు బాగా తెలుసన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజలను అన్ని విధాలా డీఎంకే ప్రభుత్వం వంచిస్తోందని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధర పెరుగుదల, పన్నుల పెంపు, విద్యుత్‌ తదితర ఛార్జీల పెంపు .. ఇలా డీఎంకే పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో పలువురు మృతి చెందారన్నారు. ఇలా ఎంత మంది మృతి చెందినా వారి కుటుంబాలకు కొన్ని లక్షలు ఇచ్చి సరిపెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోందన్నారు. కల్తీ మద్యం విక్రయానికి మంత్రి సెంజి మస్తాన్‌ సహకరిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. కల్తీ మద్యం అమ్మేవారికి, చట్ట విరుద్ధంగా బార్‌లు నిర్వహించే వారికి మంత్రి అండగా ఉంటున్నట్లు తెలుస్తోందన్నారు.  మంత్రి సెంజి మస్తాన్‌ను సీఎం స్టాలిన్‌ వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. చట్ట విరుద్ధ బార్లు మాత్రమే కాకుండా టాస్మాక్‌ దుకాణాల్లో  అక్రమంగా మద్యం విక్రయం జరుగుతోందా? లేదా? అనేది గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని