logo

పసికందును చంపిన కసాయి తల్లి

పసికందును బావిలో పడేసి చంపిన కసాయి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌హిల్స్‌ సమీప విజయనల్లూరు విజయాగార్డెన్‌కు చెందిన రమేష్‌ పెయింటర్‌.

Updated : 27 Mar 2024 02:48 IST

నిందితురాలు సత్య
రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: పసికందును బావిలో పడేసి చంపిన కసాయి తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌హిల్స్‌ సమీప విజయనల్లూరు విజయాగార్డెన్‌కు చెందిన రమేష్‌ పెయింటర్‌. ఇతని భార్య సత్య. ఈమె నెల రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. రమేష్‌ సోమవారం ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి రాగా బిడ్డ కనిపించలేదు. అతను భార్యను ప్రశ్నించగా... తాను స్నానానికి వెళ్లి వచ్చేలోగా కనిపించలేదని చెప్పింది. దీంతో రమేష్‌ ఇంటి వెనుక ఉన్న బావిలోకి చూడగా పసికందు తేలుతుండడాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిడ్డ అంగవిహీనంగా పుట్టడంతో బావిలో పడేసినట్లు సత్య అంగీకరించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 


భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

 వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్‌ జిల్లా భువనగిరి సమీపంలోని కస్పా ఆలంబట్టి గ్రామానికి చెందిన మామలై వాసన్‌ పొక్లెయినర్‌ ఆపరేటర్‌. ఆయన భార్య  అభినయ. తిట్టక్కుడి గ్రామానికి చెందిన ఈమెను మామలై వాసన్‌ ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. గతేడాది ఆగస్టు 19న అభినయ ఇంట్లో రక్తగాయాలతో శవంగా పడి ఉండటంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పారిపోయిన మామలై వాసన్‌ కోసం గాలిస్తూ వచ్చారు. ఏడు నెలల తర్వాత సొంతూరికి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు. మద్యం తాగి ఇంటికొచ్చిన సమయంలో అభినయతో గొడవ జరిగిందని, కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందిందని వాంగ్మూలం ఇచ్చాడు.


వ్యాను బోల్తా: నలుగురు విద్యార్థులకు గాయాలు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోవై శూలూర్‌ సమీప నీలాంబూర్‌లో ఓ ప్రైవేటు పాఠశాల ఉంది. మంగళవారం ఉదయం పాఠశాలకు చెందిన వ్యాను నలుగురు విద్యార్థులతో నాగమ్మ నాయకన్‌పాళ్యం మార్గం గుండా జేజేనగర్‌కు  వెళుతుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో పడింది. స్థానికులు గాయపడిన విద్యార్థులను సింగానల్లూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శూలూర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలను అక్కడి సీసీటీవీ ఫుటీజీ ఆ్వరా పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని