logo

ఇనిమేల్‌ పాట విడుదల

నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మాణంలో రూపొందిన ఆల్బం పాట ‘ఇనిమేల్‌’. కమల్‌హాసన్‌ రాసిన ఈ పాట సన్నివేశాల్లో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, శృతిహాసన్‌ జంటగా నటించారు. పాటకు శృతిహాసన్‌ సంగీతం సమకూర్చారు.

Updated : 27 Mar 2024 03:22 IST

పాటలో ఓ సన్నివేశం 

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మాణంలో రూపొందిన ఆల్బం పాట ‘ఇనిమేల్‌’. కమల్‌హాసన్‌ రాసిన ఈ పాట సన్నివేశాల్లో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, శృతిహాసన్‌ జంటగా నటించారు. పాటకు శృతిహాసన్‌ సంగీతం సమకూర్చారు. ఈ ఆల్బం ద్వారా లోకేశ్‌ కనకరాజ్‌ నటుడిగా కొత్త అవతారమెత్తారు. టీజర్‌ 21న విడుదలైన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆల్బం పూర్తి పాట విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో దీని గురించి లోకేశ్‌ కనకరాజ్‌, శృతిహాసన్‌ మాట్లాడారు.


విఘ్నేశ్‌ శివన్‌ భావోద్వేగ పోస్టు

చెన్నై: నటి నయనతార భర్త, దర్శకుడైన విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌’ (ఎల్‌ఐసీ). ప్రేమ, హాస్యభరిత సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రదీప్‌ రంగనాథన్‌, కీర్తి శెట్టి, ఎస్‌జే సూర్య, యోగిబాబు తదితరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కొన్ని రోజులుగా మలేషియా, సింగపూర్‌ దేశాల్లో చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను నయనతార హత్తుకున్న, తనతో ఇద్దరు పిల్లలు ఉన్న ఫొటోలను విఘ్నేశ్‌ శివన్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. చిత్రీకరణ పనుల కారణంగా వారాలు తరబడి కుటుంబానికి దూరంగా ఉన్నానని, తన ప్రియమైన పిల్లలు, భార్యను హత్తుకోవడానికి నిరీక్షిస్తున్నానని పేర్కొన్నారు.


మళ్లీ మెగాఫోన్‌ పడుతున్న శశికుమార్‌

చెన్నై: సందేశాత్మక చిత్రాలను అందించడంలో దిట్టగా పేరొందిన దర్శకుడు శశికుమార్‌. నటనవైపు మొగ్గుచూపిన ఆయన ఆ దిశగా కూడా తన ముద్ర వేశారు. ఆయన నటించిన ఇటీవలి చిత్రం ‘అయోద్ది’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చాలా సంవత్సరాల విరామం తర్వాత శశికుమార్‌ మళ్లీ మెగాఫోన్‌ పట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీని కోసం మహిళా ప్రాధాన్యతతో కూడిన కథను సిద్ధం చేసుకున్నారని, ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్ర పోషించనున్నారని కోలివుడ్‌ సమాచారం. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.


హాస్యనటుడు శేషు కన్నుమూత

చెన్నై: హాస్యనటుడు శేషు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మంగళవారం కన్నుమూశారు. గుండెపోటుతో 15వ తేదీ ఆళ్వార్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్సలు అందించారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. పళ్లికరణైలోని నివాసంలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుల్లితెరలో కామెడీ షో ‘లొల్లు సభ’ ద్వారా గుర్తింపు పొందిన ఆయన ఆ షో పేరుతోనే లొల్లు సభ శేషుగా ప్రసిద్ధి గాంచారు. సినీ రంగానికి పరిచయమైన ఆయన సంతానం నటించిన ‘ప్యారీస్‌ జయరాజ్‌’, ‘డిక్కిలోనా’, ‘ఏ1’, ‘కులు కులు’ తదితర పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘వడక్కుపట్టి రామసామి’ చిత్రంలో ఆయన నటన పలువురి ప్రశంసలు పొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని