logo

విళవంకోడు ఉప ఎన్నికలో విజయమెవరిది?

లోక్‌సభ ఎన్నికలతోపాటు కన్నియాకుమరి జిల్లాలోని విళవంకోడు శాసనసభ నియోజకవర్గానికి కూడా 19న ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయధరణి పార్టీ నుంచి తప్పుకొని భాజపాలో చేరారు.

Updated : 16 Apr 2024 01:49 IST

న్యూస్‌టుడే, ప్యారిస్‌

తారగై కత్‌బర్ట్‌, నందిని, రాణి, జెమిని

లోక్‌సభ ఎన్నికలతోపాటు కన్నియాకుమరి జిల్లాలోని విళవంకోడు శాసనసభ నియోజకవర్గానికి కూడా 19న ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయధరణి పార్టీ నుంచి తప్పుకొని భాజపాలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఉప ఎన్నికలో అన్నాడీఎంకే, కాంగ్రెస్‌, భాజపా, నామ్‌ తమిళర్‌ కట్చి అని నాలుగు పార్టీల నుంచి నలుగురు మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు.

కాంగ్రెస్‌దే ఆధిక్యం..

విళవంకోడులో కాంగ్రెస్‌ ఎక్కువసార్లు విజయం దక్కించుకుంది. కన్నియాకుమరి, కేరళ సరిహద్దుల్లో ఉన్న  ఈ ప్రాంతంలో మలయాళం మాట్లాడేవారు అధికంగా ఉన్నారు. ఇప్పటి వరకు 17సార్లు ఎన్నికలు జరగ్గా 12 సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2011, 2016, 2021 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన విజయధరణి వరుసగా హ్యాట్రిక్‌ గెలుపు సాధించారు. 2021 ఎన్నికల్లో విజయధరణి 87,473 ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. ఆమెకు 52.12 శాతం ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి జయశీలన్‌కు 35.04 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ప్రస్తుత ఉప ఎన్నికల్లో నలుగురు మహిళ అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఉన్నత విద్యావంతురాలు..

కాంగ్రెస్‌ తరఫున తారగై కత్‌బర్ట్‌ బరిలో నిలిచారు. ఆమె దివంగత మాజీ మంత్రి లూర్థమ్మాళ్‌ సైమన్‌ మనవరాలు. ఆమె తండ్రి కత్‌బర్ట్‌ కాంగ్రెస్‌ నాయకుడు. 1976లో జన్మించిన ఆమె మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు. ఎంఏ, ఎంఫిల్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ చదివారు. తమిళం, మలయాళం, ఇంగ్లీషు భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. టీఎన్‌సీసీ సభ్యురాలిగా, తమిళనాడు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జిల్లా మాజీ అధ్యక్షురాలిగా, యువజన విభాగ  ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఆమెకు వివాహమై ఓ కుమారుడు ఉన్నారు.

ఎలాంటి సిఫారసు లేకుండా..

భాజపా నుంచి నందిని పోటీచేస్తున్నారు. 42 ఏళ్ల వయసున్న ఆమె భాజపా జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2019 స్థానిక ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఉప ఎన్నికలో పోటీకి  వినతి లేదా ఎలాంటి సిఫారసు లేకుండానే ఆమె పేరు ప్రకటించారు. ఇది భాజపాలోని ముఖ్య నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సేవా కార్యక్రమాలతో..

అన్నాడీఎంకే అభ్యర్థిగా రాణి బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ఉన్నారు. నాగర్‌కోవిల్‌లో ఉంటున్న ఆమె మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా వృత్తి శిక్షణ ఇస్తున్నారు. విళవంకోడు నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆమె నిర్వహించే స్వచ్ఛంద సంస్థ, సేవల ద్వారా ఇక్కడి ప్రజలకు దగ్గరయ్యారు.

ఉపాధ్యాయ వృత్తి నుంచి..

నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా జెమిని పోటీచేస్తున్నారు. ఉపాధ్యాయిని అయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పదేళ్లుగా నామ్‌ తమిళర్‌ కట్చి మహిళా విభాగం నిర్వాకురాలిగా ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు గతంలో తెలిసింది. భర్త హత్యకు గురికావడంతో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు.

కాలువ సమస్య..

విళవంకోడు నియోజకవర్గంలో నొయ్యారు కాలువ పెద్ద సమస్యగా ఉంది. 2004లో కేరళ ప్రభుత్వం నొయ్యారు ఎడమ కాలువ నుంచి నీటి విడుదల నిలిపేసింది. అప్పటి నుంచి సమస్య పరిష్కారం కాలేదు. అన్ని పార్టీల నేతలు  విజయం కోసం ఈ స్థానంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని