logo

కరూరులో.. 4 ఈవీఎంలు!

లోక్‌సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ పూర్తిచేసింది. ఓటింగ్‌ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.

Published : 18 Apr 2024 01:40 IST

రాష్ట్రంలో అక్కడే అత్యధిక పోటీదారులు
రెండు స్థానాల్లో ఒక్క అభ్యర్థికి అదనపు యంత్రం
ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్‌
ఈనాడు, చెన్నై

లోక్‌సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్‌ పూర్తిచేసింది. ఓటింగ్‌ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అభ్యర్థుల సంఖ్యను అనుసరించి కొన్నిచోట్ల ఈవీఎంలు పెరగడంతో ఓటరు గందరగోళానికి గురయ్యే పరిస్థితుల కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు కచ్చితంగా ఓటేసేలా ప్రజలు అప్రమత్తమవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.


ఎక్కడెక్కడ ఎన్నెన్ని..

ఈవీఎంల సంఖ్య - పార్లమెంటు స్థానాలు

1 - తిరువళ్లూరు, కాంచీపురం, తిరుప్పూరు, నీలగిరి, పొళ్లాచ్చి, దిండుక్కల్‌, చిదంబరం, నాగపట్టిణం, తంజావూర్‌, తెన్‌కాశి.
2- మధ్య చెన్నై, శ్రీపెరుంబుదూరు, అరక్కోణం, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి, తిరువణ్ణామలై, ఆరణి, విళుపురం, కళ్లకురిచ్చి, సేలం, ఈరోడ్‌, పెరంబలూరు, కడలూరు, మయిలాడుదురై, శివగంగై, మదురై, తేని, విరుదునగర్‌, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్నియాకుమరి.
3- ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, నామక్కల్‌, కోయంబత్తూరు, తిరుచ్చి,
4- కరూరు.


23 నియోజకవర్గాల్లో..

రాష్ట్రంలోని 39 పార్లమెంటు స్థానాలకు శుక్రవారం ఎన్నిక జరగబోతోంది. పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేపనిలో ఎన్నికల కమిషన్‌ ఉంది. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లు వస్తాయి. అత్యధికంగా 23 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల సంఖ్యను అనుసరించి రెండేసి ఈవీఎంల అవసరం వస్తోంది. ఆ తర్వాత 10 స్థానాల్లో ఒక్కొక్కటి మాత్రమే వినియోగిస్తున్నారు. 5 చోట్ల మూడింటిని వాడనున్నారు. కరూరులో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఏకంగా 54 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


కర్తవ్యమేంటి?

ముందు తమ ఓటు ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. వరుస నెంబరు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కమిషన్‌ సూచించిన గుర్తింపు కార్డు సిద్ధం చేసుకోవాలి. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే ముందు.. ఎన్నికల కమిషన్‌ ప్రవేశపెట్టిన ‘కేవైసీ’ యాప్‌లో అభ్యర్థి గురించి తెలుసుకోవాలి. అతనిపై నేరారోపణలు, ఇతర వివరాలు చదువుకోవాలి. ఆ తర్వాత పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తమకు ఏ అభ్యర్థి బాగుంటుందో ఈవీఎం యంత్రంలో పేరు, గుర్తు చూసి ఓటేయాలి. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా.. ఎస్టీడీ కోడ్‌ జతచేసి 1950 టోల్‌ఫ్రీ నెంబరుకు సంప్రదించవచ్చు.


ఈ స్థానాలు  ప్రత్యేకం..

రాష్ట్రంలో విళుపురం, మయిలాడుదురై పార్లమెంటు స్థానాలు పోలింగ్‌ సందర్భంగా ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. ఈ రెండుచోట్లా 17మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒక్కో యంత్రంలో 16 పేర్లే వస్తుండటంతో మిగిలిన ఒక్కరి కోసం ప్రత్యేక ఈవీఎంను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విళుపురంలో స్వతంత్ర అభ్యర్థి విజయన్‌, మయిలాడుదురైలో స్వతంత్ర అభ్యర్థి జాఫరుల్లాఖాన్‌ కోసం వాటిని వినియోగించనున్నారు. నాగపట్టిణంలో అత్యల్పంగా 9 మంది మాత్రమే పోటీలో ఉన్నారు.


90 నిమిషాల ముందే..

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ రోజున నిర్ణీత సమయానికి 90 నిమిషాల ముందే మాక్‌పోల్‌ నిర్వహిస్తారు. అభ్యర్థికి కనీసం ఒక ఓటు చొప్పున మొత్తంగా 50 ఓట్లను అధికారులే వేసి యంత్రాల పనితీరు పరీక్షిస్తారు. ఇదంతా ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో నడుస్తుంది. వీవీప్యాట్‌ చీటీలు సైతం వారిముందే లెక్కిస్తారు. అందరి ఆమోదంతో ఇదివరకు వేసిన మొత్తం ఓట్లను, డేటాను రద్దుచేసి కంట్రోల్‌ యూనిట్‌కు సీల్‌ వేసి ఎన్నికలకు సిద్ధమవుతారు.


ఓటర్లూ జాగ్రత్త..

ఓటింగ్‌ కోసం ప్రజలు సిద్ధమయ్యారు. తడబాటులేకుండా ఎంచుకున్న కచ్చితమైన అభ్యర్థి ఎదురుగా ఉన్న మీట నొక్కేలా ఎన్నికల కమిషన్‌ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఓటర్లు గుర్తించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి..

  • పోలింగ్‌ కేంద్రంలో ఓటరుకు అందుబాటులో ఉన్న ఈవీఎంలో తాను ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో.. వారి పేరు, గుర్తు ముందున్న నీలపురంగు మీట నొక్కగానే పక్కనే ఉన్న ఎర్రటిదీపం వెలుగుతుంది. తమ ఓటు నమోదైందని దీనర్థం.
  • ఈవీఎం పక్కనే వీవీప్యాట్‌ యంత్రాన్ని ఉంచుతారు. ఓటు పడిందా లేదా నిర్ధరించుకునేందుకు వీవీప్యాట్‌ని వినియోగించుకోవచ్చు. తెరపై ఓటరు పేరు, వరుససంఖ్య, ఓటరు వేసిన గుర్తు కనిపిస్తాయి. 7సెకన్ల పాటు కనిపించి కనుమరుగవుతుంది. ఈ ప్రక్రియలోనే గదిలోని కంట్రోల్‌ యూనిట్లో బీప్‌ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ఓటు పూర్తిస్థాయిలో పడిందన్నట్లుగా అక్కడి అధికారులు నిర్ధరణకు వస్తారు.

ఓపీఎస్‌కు పైనా కిందా ఓపీఎస్‌లు

రామనాథపురం ఎన్డీయే తరపున స్వతంత్ర అభ్యర్థిగా దిగిన ఒ.పన్నీరుసెల్వంకు ఇప్పుడు మరో పెద్ద చిక్కొచ్చిపడింది. ఓట్లు పక్కకెళ్తాయనే కంగారు ఆయనలో మరింత ఎక్కువైందనే చెప్పాలి. ఇక్కడ మొత్తం 25 మంది పోటీపడుతున్నారు. ఓపీఎస్‌తో కలిసి మొత్తం 17మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. అసలు చిక్కు ఇక్కడే ఉంది. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లే వస్తాయి. మిగిలినవారి కోసం రెండోది వాడుతున్నారు. రెండో ఈవీఎంలో 9మంది స్వతంత్రులు వస్తున్నారు. 22వ వరస సంఖ్యలో ఒ.పన్నీరుసెల్వం పేరుంది. విచిత్రంగా ఈయన పేరుకు ముందు 18, 19, 20, 21 వరససంఖ్యలో నలుగురు ఒ.పన్నీరుసెల్వంలున్నారు. ఈయన పేరుకింద 23వ నంబరులో ఎం.పన్నీరుసెల్వం పేరుతో మరో స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఇంతమందిలో అసలు ఓపీఎస్‌ను గుర్తుపట్టి ఓటర్లు తమ ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని