logo

జారవిడుచుకున్న ఏటీఎం కార్డులే లక్ష్యం

ప్రజలు జారవిడుచుకున్న ఏటీఎం కార్డులను ఉపయోగించి లక్షల్లో నగదు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... చెన్నై చూళైమేడుకి చెందిన కార్తికేయన్‌ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.

Updated : 01 May 2024 01:10 IST

లక్షల్లో నగదు కాజేసిన నిందితుడి అరెస్టు

నిందితుడు శ్రీనివాసరెడ్డి

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రజలు జారవిడుచుకున్న ఏటీఎం కార్డులను ఉపయోగించి లక్షల్లో నగదు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... చెన్నై చూళైమేడుకి చెందిన కార్తికేయన్‌ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను గత మార్చి 31న తన ఏటీఎం కార్డుని జారవిడుచుకున్నట్లు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అదేరోజు తన బ్యాంకు ఖాతా నుంచి మూడు విడతలుగా రూ.12 వేలు విత్‌డ్రా అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న చూళైమేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం అరుంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ఏటీఎం కేంద్రం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. అతను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన తల్లా శ్రీనివాసరెడ్డి అని, ఇంజినీరింగ్‌ చదివి గతంలో బ్యాంకులో ఉద్యోగం చేశాడని తెలిసింది. బ్యాంకులో పనిచేసే సమయంలో డెబిట్‌ కార్డుని ఏ విధంగా ఉపయోగించాలి, నగదు ఏవిధంగా తీయాలి మొదలైన సాంకేతిక మెలకువలు తెలుసుకున్నాడని, అనంతరం బ్యాంకు ఉద్యోగం మానేసి, డెబిట్‌ కార్డులు చోరీ చేయడం ప్రారంభించాడని, అదేవిధంగా ప్రజలు జారవిడుచుకునే కార్డులను ఉపయోగించి స్వైపింగ్‌ మిషన్‌ ద్వారా నగదు విత్‌డ్రా చేసేవాడని తెలిసింది. ఇలా కాజేసిన నగదుతో ఉన్నతంగా బతుకుతున్నాడు. ఇలా చెన్నై, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అతని నుంచి 63 ఏటీఎం కార్డులు, స్వైపింగ్‌ మిషన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై హైదరాబాద్‌లో 11 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు దరాప్తులో తెలిసింది.


బాలికపై హత్యాచార వ్యవహారం

600 పేజీల అభియోగపత్రం సిద్ధం

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పుదుచ్చేరి ముత్తియాల్‌పేట్టై సోలైనగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక మార్చి 2న హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే ప్రాంతానికి చెందిన గంజాయి బానిసలుగా ఉన్న వివేకానందన్‌ (57), కరుణాస్‌ (19)ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను కొన్నిరోజుల క్రితం పుదుచ్చేరి పోక్సో ప్రత్యేక కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. పోక్సో కేసులో 60 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయాలి. ఆ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం పుదుచ్చేరి ఈస్ట్‌ ఎస్పీ లక్ష్మి నేతృత్వంలో ముత్తియాల్‌పేట్టై పోలీసులు అభియోగపత్రం సిద్ధం చేశారు. 600 పేజీల దర్యాప్తు నివేదికను డీజీపీకి, న్యాయశాఖ సలహాల కోసం పంపారు. వారి సలహాల మేరకు ఏవైనా సవరణలు ఉంటే చేసి కోర్టులో దాఖలు చేయనున్నారు.


నిర్మలాదేవికి 10 ఏళ్ల జైలు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: కళాశాల విద్యార్థినులను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లిన కేసులో ప్రొఫెసరు నిర్మలాదేవికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో నిర్మలాదేవిని దోషిగా తేలుస్తూ సోమవారం శ్రీవిల్లిపుత్తూర్‌ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆమె తరఫున న్యాయవాది వాదిస్తూ.. తక్కువ శిక్ష విధించాలని, అదేవిధంగా తమ తరఫు వాదనలు తెలిపేందుకు శిక్షను వాయిదా వేయాలని కోరడంతో శిక్ష వివరాలను మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం నిర్మలాదేవి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిర్మలాదేవి వల్ల బాధింపునకు గురైనట్లు ఫిర్యాదు చేసిన వారు సమాజంలో మామూలుగానే జీవిస్తున్నారని, ఆమె వలన ఏవిధంగానూ ప్రభావితం అయినట్లు కనిపించడం లేదన్నారు. కావున ఆమెకు శిక్ష తగ్గించాలని కోరారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తి... నిర్మలాదేవికి పదేళ్ల జైలు శిక్ష, రూ.2.45 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని