logo

పెళ్లికానుక.. నిబంధనల మెలిక

నిరుపేద వధువులు వివాహాలు చేసుకోడానికి వీలుగా వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీతోఫాకు దరఖాస్తు చేసుకునే విధివిధానాలు వివరిస్తూ ఈ ఏడాది సెప్టెంబరు 30న ప్రభుత్వం జీఓ నం. 50 విడుదల చేసింది.

Published : 03 Dec 2022 03:03 IST

వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తుకు దరఖాస్తులే లేవు

వాలంటీర్ల నుంచి సేకరించేలా సన్నాహాలు  

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

నిరుపేద వధువులు వివాహాలు చేసుకోడానికి వీలుగా వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీతోఫాకు దరఖాస్తు చేసుకునే విధివిధానాలు వివరిస్తూ ఈ ఏడాది సెప్టెంబరు 30న ప్రభుత్వం జీఓ నం. 50 విడుదల చేసింది. అయితే దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని  సంప్రదించాలి అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా రెండునెలలైనా ఇంతవరకు ఒక్క దరఖాస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు (డీఆర్‌డీఏ) రాలేదు. ఇక్కడ లాగిన్‌లో దరఖాస్తు నమోదైతే కలెక్టర్‌ లాగిన్‌కి పంపుతారు. అక్కడి నుంచి కల్యాణమస్తు నిధులు మంజూరు చేస్తారు.

గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న పెళ్లికానుక ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దీనిని రద్దు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30 నుంచి వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక, షాదీతోఫా కింద నగదు చెల్లించేలా జీఓ ఇచ్చారు. కానీ దీని గురించి పెద్దగా తెలియక పోవడం, నిబంధనలు కఠినంగా ఉండటంతో చాలామంది అసలు దరఖాస్తే చేయలేదు. దీనికితోడు ఇప్పటివరకు మూఢం కావడంతో పెళ్లి ముహూర్తాలు పెద్దగా లేవు. ఈనెల నుంచి ముహూర్తాలు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులంతా కల్యాణమస్తుకు దరఖాస్తు చేసుకునేలా వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇకపై వాలంటీర్లు వారి పరిధిలో జరిగే వివాహాల గురించి తెలుసుకుని ఈ పథకాల గురించి లబ్ధిదారులకు తెలియజేయాల్సి ఉంది.


లబ్ధి ఇలా..

* ఎస్సీ, ఎస్టీ : రూ. 1,00,000 ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలు: రూ. 1,20,000

* బీసీ రూ. 50,000 బీసీ కులాంతర వివాహం రూ. 75,000

* మైనారిటీలకు రూ. లక్ష

* దివ్యాంగులకు రూ. 1,50,000

నవంబరు 1 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకుంటే ఫిబ్రవరిలో... ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 30 వరకు అర్జీ పెట్టినవారికి మే నెలలో... మే నుంచి జులై 30 వరకు ఆగస్టులో... ఆగస్టు నుంచి అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకుంటే నవంబరులో నగదు జమ చేస్తారు.


అర్హతలు ఇలా..

పెళ్లిరోజుకు వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు నిండాలి. మొదటి పెళ్లి అయి ఉండాలి. భర్త చనిపోయిన స్త్రీ అయితే రెండో పెళ్లి చేసుకున్నా అర్హురాలే.
వధూవరులు ఇద్దరూ 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

కుటుంబ ఆదాయం పల్లెల్లో రూ. 10 వేలు, పట్టణాల్లో రూ. 12 వేలు మించకూడదు.

కుటుంబ భూమి మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు, రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు.

కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి, పింఛనుదారుడు ఉండకూడదు. నెలసరి విద్యుత్‌ వాడకం 300 యూనిట్లకు మించకూడదు. 12 నెలల విద్యుత్తు వినియోగం సగటున తీసుకుంటారు. కుటుంబంలో ఏ వ్యక్తి ఆదాయ పన్ను కట్టకూడదు. కుటుంబ పట్టణ ఆస్తి 1000 చ.అ. మించకూడదు.


గతంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న వధువు తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుంటే నగదు ఇచ్చేవారు. ఇప్పుడు విద్యుత్తు వినియోగం నిబంధనతో చాలామంది అర్హత కోల్పోయే ఆస్కారం ఉంది. పదోతరగతి అర్హత కారణంగా పల్లెల్లో చదువు మానేసిన ఆడపిల్లలకు లబ్ధి అందకుండా పోయే ప్రమాదం ఉంది.


దరఖాస్తులు రాలేదు

లక్ష్మీపతి డీఆర్‌డీఏ పీడీ, అనకాపల్లి జిల్లా

కల్యాణమస్తు   దరఖాస్తులు డీఆర్‌డీఏ లాగిన్‌కి రావాలి. ఇక్కడి నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి పంపుతాం. అక్కడ పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం డీఆర్‌డీఏ లాగిన్‌కి ఒక్క దరఖాస్తూ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం మా లాగిన్‌కి అవి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని