logo

అరాచక పాలనపై పోరాడే సమయమిది

రాష్ట్రంలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా పొలిట్‌బ్యారో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచార సభలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు.

Published : 05 May 2024 03:45 IST

నందమూరి బాలకృష్ణ

సభలో మాట్లాడుతున్న బాలయ్య

ఎలమంచిలి, అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా పొలిట్‌బ్యారో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచార సభలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. వైకాపా నాయకుల అక్రమార్జనకు ఖనిజాలు, సముద్రాలు సైతం సరిపోవడం లేదన్నారు. సీఎం జగన్‌ రుషికొండకు గుండుగీసి గ్రావెల్‌ దోచుకున్నారన్నారు. నవరత్నాలతో ప్రజలకు నవగొయ్యిలు తీశాడని విమర్శించారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, ఇప్పుడు ఆయనే మద్యం వ్యాపారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. జగన్‌ సీఎంలా కాకుండా సైకోలా పరిపాలన సాగిస్తున్నాడని, మాస్కు అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్‌ను పొట్టన పెట్టుకున్నాడని గుర్తు చేశారు. జగన్‌ అరాచకాలను ఐదేళ్లు ఓపిగ్గా భరించామని, ఇప్పుడు ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసిందని, ఎదిరించిన వారిపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ చట్టం కేసులు నమోదు చేసి భయాందోళన సృష్టించిందన్నారు.

మత్స్యకారులు, నిర్వాసితులను ఆదుకుంటాం

తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లుగా అన్యాయానికి గురైన పూడిమడక మత్స్యకారులను ఆదుకుంటామని బాలయ్య హామీ ఇచ్చారు. గ్రామంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నిర్వాసితులకు తెదేపా న్యాయం చేస్తే, వైకాపా అన్యాయం చేసిందన్నారు. నిర్వాసితులకు ఉపాధి కల్పనతోపాటు వారి పెండింగ్‌ సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబు అనుభవమంత వయసు లేని మంత్రి అమర్‌నాథ్‌ ఆయన్నే విమర్శిస్తున్నాడని బాలయ్య మండిపడ్డారు. విశాఖ సదస్సు ద్వారా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, వచ్చిన పెట్టుబడులు ఎంత, యువతకు దక్కిన ఉపాధి ఎంత అనే విషయం అడిగితే పరిశ్రమల శాఖ మంత్రిగా సమాధానం చెప్పాల్సిన అమర్‌నాథ్‌ కోడిగుడ్డు పెట్టింది, అది పిల్లలు పెడుతుందని సామెతలు చెప్పాడన్నారు. వైకాపా నాయకుల అవినీతి వల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి వెనక్కి పోయాయన్నారు. ఆడ, మగ తేడాలేకుండా దూషించడమే ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు విధానమన్నారు. ప్రజల ఆస్తులు కబ్జా చేయడం, అక్రమ లేఅవుట్లు వేయడం ఆయన దినచర్యని పేర్కొన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షులు తాతయ్యబాబు, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌  ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, సీఎం రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రావికమతం, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమిని ఆశీర్వదించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని సినీ హీరో నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కొత్తకోటలో శనివారం రాత్రి రోడ్డుషో నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తూ.. వైకాపా ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న వాటిని వెళ్లగొట్టి యువతకు ఉద్యోగాల్లేకుండా చేసిందన్నారు. ఒక రాక్షసుడి పాలనను అంతం చేసేందుకు అందరూ చేతులు కలపాలని కోరారు. చోడవరం తెదేపా అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని