logo

తిందాం రండి.. భీమాళి తాండ్ర

భీమాళి.. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది మామిడి తాండ్ర. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తయారు చేస్తున్నా ఇక్కడి రుచికి అవి సాటిరావంటే నమ్మశక్యం కాదేమో.

Published : 26 May 2023 02:53 IST

న్యూస్‌టుడే, ఎల్‌.కోట, కొత్తవలస

భీమాళి.. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది మామిడి తాండ్ర. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తయారు చేస్తున్నా ఇక్కడి రుచికి అవి సాటిరావంటే నమ్మశక్యం కాదేమో. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి సిద్ధంగా తయారు చేయడం ఈ గ్రామస్థుల ప్రత్యేకత. మామిడి గుజ్జు, పంచదార మాత్రమే ఉపయోగించి మిశ్రమాన్ని చాపలపై వేసి ఎండలో ఆరబెట్టి సంప్రదాయబద్ధంగా పొరలు వేస్తారు. రెండున్నర ఇంచీల దళసరి ఉండే ఒక్కో అచ్చులో 180 వరకు పొరలుంటాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజన్‌ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా పసుపుమయంగా మారింది. 

ఏప్రిల్‌లో మొదలై..

గ్రామంలో దాదాపు 80 శాతం కుటుంబాలకు ఇదే జీవనాధారం. ఏటా ఏప్రిల్‌లో మొదలు పెట్టి జూన్‌ వరకు కొనసాగిస్తారు. కర్రలతో చిన్నపాటి పందిళ్లు వేసి దానిపై తాటాకు చాపలు పరుస్తారు. కలెక్టర్‌, కోలంగోవా, ఇతర రసాల నుంచి జ్యూస్‌ తీసి, దానికి పంచదార కలిపి చాపలపై చేతులతో రాస్తారు. అలా పొరలు ఏర్పడతాయి. రోజుకు ఆరుసార్లు చొప్పున నెల పాటు 180 దఫాలు జ్యూస్‌ను  
పోస్తారు.

అంట్లు నుంచి తయారీ వరకు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం నుంచి కొన్ని కుటుంబాలవారు భీమాళికి వలస వచ్చారు. మొదట మామిడికాయల టెంకల నుంచి అంట్లు కట్టి మొక్కలు విక్రయించేవారు. క్రమంగా ఈ అమ్మకాలతో పాటు తాండ్ర తయారీపై దృష్టిసారించారు. రానురానూ అదే వారి జీవనాధారమైంది. ఆదాయం బాగుండడంతో గ్రామమంతా ఏటా అదే పనిలో నిమగ్నమయ్యేది. ఇలా ఏభై ఏళ్లుగా ప్రక్రియ సాగుతోంది. కొత్తవలస మండలం చినరావుపల్లి, జామి మండలం అలమండలోనూ తయారీదారులున్నారు. ప్రస్తుతం మొక్కల తయారీ ఆగిపోయింది.

ఇతర ప్రాంతాలకు..

ప్యాకింగ్‌ చేశాక.. ఉత్తరాంధ్రలోని జిల్లాలతో పాటు విజయవాడ, బరంపురం, హైదరాబాద్‌, కోల్‌కత్తా.. తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. తక్కువ మొత్తంలో తయారు చేసేవారు స్థానికంగానే విక్రయిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తిదారుల వద్ద హోల్‌సేల్‌గా కిలో రూ.120 ఉండగా.. బయట మార్కెట్‌లో రూ.150కిపైగా పలుకుతోంది.


సోలార్‌ శీతల గిడ్డంగి..

తేడాది అలమండ ప్రాంతంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శ్రీపరదేశమ్మ తల్లి మామిడి ఉత్పత్తిదారుల సహాయ సహకార పరపతి సంఘం సహకారంతో 20 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన సోలార్‌ శీతల గిడ్డంగిని ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు రూ.25 లక్షలు ఖర్చయింది. అయితే చాలామంది చాపలపైనే పొరలు పోసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విజయనగరం, ఆనందపురంలో ఉన్న శీతల గిడ్డంగుల్లో కొందరు నిల్వ చేస్తారు. కానీ ప్రభుత్వ పరంగా ప్రత్యేక కేంద్రాలు లేవు.


ఆదాయం తక్కువైనా..

మామిడి కాయలను విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి టన్ను రూ.18 వేల చొప్పున కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం స్థానికంగానే వివిధ రకాలు అందుబాటులో ఉండడంతో వెయ్యి కిలోలు రూ.7 వేలకే వస్తున్నాయని చెబుతున్నారు. పంచదారను చోడవరంలోని చక్కెర కర్మాగారం నుంచి తెస్తున్నారు. ఒక్కో చాప నుంచి 70 కిలోల వరకు తాండ్ర వస్తుంది. దీని తయారీకి 600 వరకు కాయలు, 40 కిలోల పంచదార అవసరం. పెట్టుబడి, కూలీల ఖర్చుతో కలుపుకొని ఒక చాపకు రూ.5,500 వరకు ఖర్చవుతుందని అంచనా. దాన్ని అమ్మితే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు లాభం వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడివారు ఆదాయంతో సంబంధం లేకుండా తయారీకి ముందుకొస్తున్నారు.


రాయితీలు కల్పిస్తే ప్రయోజనం..

- కె.కృష్ణ, సర్పంచి, భీమాళి

మూడు సంవత్సరాల నుంచి పెద్దఎత్తున తయారు చేస్తున్నాం. యంత్రాలున్నా.. ఎక్కువగా కూలీలే పనులు చేస్తారు. అన్ని ఖర్చులు పోనూ దానికి తగ్గట్టుగానే ఆదాయం వస్తోంది. ఈ ఏడాది ఇక్కడ ఆరు లక్షల వరకు చాపలొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తే తయారీదారులు సంతోష పడతారు. ఆర్థిక ఇబ్బందులు సైతం దూరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు