logo

ఆయిల్‌ పామ్‌లో ఉంది..!

ఎక్కువ లాభం, తక్కువ నిర్వహణ కలిగిన ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆయిల్‌పామ్‌ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, కేంద్ర బృందం

Published : 21 May 2022 01:50 IST

ఉమ్మడి జిల్లాలో సాగుకు అనుకూలం..

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

తొర్రూరు టౌన్‌: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామశివారులో టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 42 ఎకరాల్లో గతేడాది అక్టోబరులో ప్రభుత్వం నర్సరీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఐదు లక్షల మొక్కలు పెంచుతున్నారు. నర్సరీలో షేడ్‌నెట్‌లో 4 నెలలు, అనంతరం ఓపెన్‌ గ్రౌండ్‌లో మరో 8 నెలలు పెంచి రాయితీపై రైతులకు అందజేస్తారు.


ఎక్కువ లాభం, తక్కువ నిర్వహణ కలిగిన ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆయిల్‌పామ్‌ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, కేంద్ర బృందం ఉమ్మడి జిల్లాలో సాగు పరిస్థితులపై సర్వే చేపట్టింది. ఇక్కడి నేలలు అనుకూలమని కేంద్ర శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. ఇప్పటికే జిల్లాల్లో 1929 ఎకరాల్లో పండిస్తున్నారు.

ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఏర్పాట్లు..

ఆయిల్‌ పామ్‌ పంట కొనుగోళ్లు, మార్కెటింగ్‌పైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులు స్థానికంగా విక్రయించుకునే ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకో ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించేందుకు కంపెనీలను ఎంపిక చేసింది.

తొర్రూరు మండలంలోని గొపలగిరి గ్రామశివారులో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం 80 ఎకరాల స్థల సేకరణ చేసింది. పనులు ప్రారంభం కావాల్సి ఉంది.్చ

ఈ పంటే ఎందుకంటే..

* ఆయిల్‌పామ్‌ లాభదాయకంగా ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..

* మొక్కలు నాటిన 4వ ఏటా నుంచి పంట చేతికి వస్తుంది. 40 నుంచి 60 రోజుల్లో గెలలు కోతకు వస్తాయి. ఏడాది పొడవునా దిగుబడి వస్తూనే ఉంటుంది. 30 ఏళ్ల వరకు ఆదాయం ఉంటుంది.

* ఎకరాకు 14 నుంచి 18 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. టన్నుకు రూ.22 వేలు ధర పలుకుతోంది. 10 టన్నులు దిగుబడి వచ్చినా ఏడాదిలో రూ. 2.20 లక్షలు ఆర్జించవచ్ఛు

* యాజమాన్యం, నిర్వహణ తక్కువ.. పంటలకు రోగాలు, చీడపీడల బెడద ఉండదు.

* పంటకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. మనదేశం.. ఏడాదికి రూ.70 వేల కోట్లకు పైగా విలువైన పామ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది.

* మొక్కమొక్కకు 9 మీటర్ల ఎడంతో నాటుతారు. అంతర పంటలను కూడా వేసుకోవచ్ఛు

* డ్రిప్‌ ఏర్పాటు కోసం హెక్టారుకు రూ.48,381 రాయితీ ఉంటుంది.

మొక్కలు కావాలా.. వీటిని అనుసరించండి

* తెలంగాణ ప్రభుత్వ పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఎండాలి. * క్షేత్రం మట్టి, నీటి పరీక్షలు నిర్వహించుకున్న పత్రాలు ఉంచుకోవాలి. * మండలంలోని ఉద్యానవన శాఖ విస్తరణాధికారి (హెచ్‌ఈవో) లేదా ఆయిల్‌పామ్‌ కంపెనీ ప్రతినిధి లేదా ఏఈఓలను కలిసి భూమికి సంబంధించిన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి * తర్వాత ఉద్యానశాఖ అధికారి, మొక్కలు ఇచ్చే కంపెనీ ప్రతినిధి, డ్రిప్‌ కంపెనీ ప్రతినిధి సంయుక్త సర్వే చేస్తారు. అన్ని అనుకూలంగా ఉంటే ధ్రువీకరిస్తారు.* ఆన్‌లైన్‌లో రైైతు పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తారు. * డ్రిప్‌ కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రైతు చెల్లించే వాటాను డీడీ తీయాలి. * సమగ్ర సమాచారంతో ఉద్యానశాఖ అధికారి రైతుకు సంబంధించిన దస్త్రాన్ని కలెక్టర్‌కు ప్రతిపాదిస్తారు. ఆయన పరిశీలించి మంజూరు ఇస్తారు. * మంజూరైన ఏడు రోజుల్లో డ్రిప్‌ పరికరాలు వస్తాయి.. కంపెనీ వారు బిగిస్తారు. * తర్వాత సీనియారిటి ప్రకారం మొక్కలు పంపిణీ చేస్తారు.

4 ఎకరాల్లో నాటాను.. : - శ్రీనివాస్‌, అడువాలపల్లి, మల్హర్‌ మండలం

ఆయిల్‌ పామ్‌తో లాభాలను అధికారులు వివరించారు. మట్టి నమూనాల పరీక్షలు చేయించాను. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో 4 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటాను. ప్రస్తుతానికి బాగుంది.

ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకోవచ్చు : - అక్బర్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి, జయశంకర్‌ భూపాలపల్లి

ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌ పామ్‌ సాగును రైతులు ఎంచుకోవచ్ఛు ఇతర పంటలతో పోల్చి చూసినప్పుడు ఇదెంతో లాభదాయకం. చీడపీడల బాధ, ప్రకృతి వైపరీత్యాల నష్టం కూడా తక్కువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని