logo

ఇక సర్వే బాట

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం రోజు రోజుకు విస్తరిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలతో పట్టణ జనాభా పెరుగుతోంది. భవిష్యత్తులో ప్రజల అవసరాల మేరకు

Updated : 28 May 2022 04:01 IST

మానుకోట మాస్టర్‌ ప్లాన్‌కు కార్యాచరణ

పురపాలక సంఘం చిత్రపటం

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం రోజు రోజుకు విస్తరిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలతో పట్టణ జనాభా పెరుగుతోంది. భవిష్యత్తులో ప్రజల అవసరాల మేరకు పట్టణంలో మౌలిక సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) తయారీకి కార్యాచరణ రూపొందిస్తోంది. 2018కి ముందు బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఈ పురపాలక సంఘంలో ఆరు గ్రామపంచాయతీలు విలీనం కావడంతోపాటు జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. 2011 జనాభా ప్రాతిపదికను తీసుకొని 2044 వరకు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని అసౌకర్యాలు కల్పించేందుకు ఒక పద్ధతి ప్రకారం పట్టణాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 28 నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ శాఖ అధికార స్థానిక అధికారులను ఆదేశించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు శుక్రవారం వరంగల్‌లోని రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షించారు. నూతన ప్రణాళికతో పట్టణ రూపురేఖలు మారనున్నాయి.

నలుగురు అర్బన్‌ ప్లానర్ల నియామకం

రాబోయే రెండు దశాబ్ధాల వరకు ప్రజల అవసరాల మేరకు పట్టణాన్ని ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు నలుగురు అర్బన్‌ ప్లానర్లను నియమించారు. వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించనున్నారు.

రహదారులు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యంతోపాటు ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు ఏ ప్రాంతంలో జనావాసాలు ఉండాలి మార్కెట్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, పట్టణీకరణ కోసం ఎంత శాతం భూములను కేటాయించాలనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

రహదారుల విస్తరణ, లే-అవుట్లు, క్రీడా మైదానాలు, వినోద స్థలాల కేటాయింపుపై సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తారు.

అధికారులు రూపొందించిన ప్రణాళికపై ప్రజాభిప్రాయం తీసుకుంటారు. ఆ తర్వాత ముసాయిదా తయారు చేసి పురపాలక వర్గం సమావేశంలో సభ్యుల సూచనలు, సలహాలతో సవరణలు చేసి ప్రభుత్వ ఆమోదం పొందుతారు. ఆ తర్వాత నిబంధనల మేరకు పట్టణీకరణపై ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకుంటారు. దీంతో ప్రణాళికాబద్దంగా పట్టణ నిర్మాణం జరుగుతుంది.

విలీన గ్రామాలు:

అనంతారం, జమాండ్లపల్లి, ఈదులపూసపల్లి, శనగపురం, రజాలిపేట, బేతోలు.

పట్టణ సరిహద్దు గ్రామాలు:

కురవి, మొగిలిచెర్ల, గుండ్రాతిమడుగు కొత్తూరు, ఉప్పలపాడు, గౌరారం, నడివాడ, రెడ్యాల, లక్ష్మీపురం, వేమునూర్‌, అన్నారం, ముడుపుగల్‌, పర్వతగిరి, మల్యాల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని