logo

మాయమవుతున్నాయ్‌..!

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు సుమారు మూడు దశాబ్ధాల కిందట నిర్మించిన ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలు మాయమవుతున్నాయి.

Published : 28 Jun 2022 06:16 IST

కబ్జాకు గురవుతున్న ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలు

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు సుమారు మూడు దశాబ్ధాల కిందట నిర్మించిన ఎస్సారెస్పీ మైనర్‌ కాలువలు మాయమవుతున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల పరిధిలో నలువైపుల సాగుతున్న స్థిరాస్తి వ్యాపారం జోరులో ఆ కాలువల ఆనవాళ్లు కనిపించడం లేదు. సంబంధితశాఖ అధికారులు ఈ విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యంతోనే..

రెవెన్యూ, ఎస్సారెస్పీ(నీటి పారుదల) శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆ కాలువలు అన్యాక్రాంతమవుతున్నాయి. సాగు భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే సమయంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో గతంలో ఎస్సారెస్పీ కాలువలకు భూసేకరణ చేశారా... ఇంతకు ముందు ఏమైనా కాలువలు ఉన్నాయా అనే విషయం పరిశీలించకుండానే నాలా అనుమతులు జారీ చేస్తుండడంతో కబ్జాకు గురవుతున్నాయని ప్రచారంలో ఉంది.

ఇళ్ల నిర్మాణాల కోసమే..

దశాబ్దానికి పూర్వం సుమారు లక్ష ఎకరాలకు పైగా భూములకు సాగునీటిని సరఫరా చేసేందుకు ఎస్సారెస్పీ (వెన్నవరం) డీబీఎం-48 మొదటి దశ కాలువలను నిర్మించారు. భూములు కోల్పోయిన వారికి అప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించారు. ప్రధాన కాలువలకు అనుసంధానంగా ఉన్న 18 ఎల్‌ఆర్‌, 16 ఎల్‌ఆర్‌, 12 ఎల్‌ఆర్‌, 8 ఎల్‌ఆర్‌, 4 ఎల్‌ఆర్‌ మైనర్‌ (పిల్ల) కాలువలను పూడ్చివేసి తమ పొలాలతో కలిపి కొందరు ఇళ్ల స్థలాలుగా మారుస్తున్నారు. మరికొందరు తమ భూముల్లోనే కలుపుకొని సాగు చేసుకుంటున్నారు. సుమారు 36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మహబూబాబాద్‌ పట్టణం చుట్టూ సాగు భూములు, వ్యవసాయేతర భూములుగా మారడంతో మైనర్‌ కాలువలను క్రమేణా మూసివేస్తున్నారు.

ఉదాహరణకు కొన్ని

* మహబూబాబాద్‌ పట్టణంలోని ఈదులపూసపల్లి వెళ్లే రోడ్‌లో అంబేడ్కర్‌ కాలనీ సమీపంలో ఎస్పారెస్పీ కాలువలు అదృశ్యమయ్యాయి.

* శనగపురం శివారు, బీసీ కాలనీ సమీప ప్రాంతాల్లో కూడా అన్యాక్రాంతానికి గురైంది.

* మంగళి కాలనీ- మల్యాల వెళ్లే రోడ్‌లో కాలువలను పూడ్చి వేశారు.

* మరిపెడ వెళ్లే రోడ్‌ నుంచి అనంతాద్రి ఆలయం వెళ్లే రోడ్‌లో వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగా మారడంతో ఎస్పారెస్పీ మైనర్‌ కాలువలు కనిపించడం లేదు.

పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం : - కిషోర్‌, డీఈఈ, నీటి పారుదలశాఖ

కాలువలు పూడ్చివేసినట్లు సమాచారం వస్తే క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఎస్సారెస్పీ కాలువలను ఆక్రమించినా, ధ్వంసం చేసినా కఠిన చర్యలు తప్పవు.


కాలువ అంచువరకు చదును

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎస్పారెస్పీ కాలువ పర్వతగిరి రెవెన్యూ గ్రామం పరిధిలోని సుమారు 500 మీటర్ల పొడవు వరకు ఎస్సారెస్పీ కాలువ అంచు వరకు చదును చేసి సంబంధిత ఆ రైతు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఫుట్‌వేగా రెండు వైపుల ఉన్న స్థలాన్ని సంబంధిత రైతు కబ్జా చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుంది. ఇలా వ్యవసాయ భూముల్లో నుంచి వెళుతున్న కాలువను పలువురు ఆక్రమించుకున్నారు.


పూడ్చేస్తున్నారు..

మహబూబాబాద్‌ పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో సబ్‌జైల్‌కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఈ కాలువను సమీప ప్రాంత రైతులు పూడ్చేశారు. ఇటీవల ఆ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చేందుకు కాలువ పొడువున ఉన్న ఫుట్‌వే (కాలిబాట) కోసం సేకరించిన స్థలాన్ని కూడా భూముల్లో కలిపివేశారు. ఈ ప్రాంతంలో గజం స్థలం విలువ రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఒక్కో ప్లాట్‌లో పది గజాల స్థలం కలిసినా రూ. లక్ష విలువైన భూమిని ఎస్పారెస్పీ కాలువ కోల్పోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని