logo

పీవీ సేవలు చిరస్మరణీయం

మెట్ట ప్రాంత సాగుకు గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా గోదారి జలాలు పారిస్తామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ స్పష్టం చేశారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని స్వగ్రామం వంగరలో

Published : 29 Jun 2022 03:17 IST

పీవీ విగ్రహానికి నమస్కరిస్తున్న ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: మెట్ట ప్రాంత సాగుకు గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా గోదారి జలాలు పారిస్తామని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ స్పష్టం చేశారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని స్వగ్రామం వంగరలో మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు 101వ జయంతి వేడుక ఘనంగా జరిగింది. పీవీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, జడ్పీ ఛైర్మన్‌ సుధీర్‌కుమార్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రైతువేదికలో పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్‌మోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో  మాట్లాడారు. పీవీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. వరదకాలువ పీవీ కల అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎల్లంపల్లి, మధ్య మానేరు మీదుగా రైతాంగానికి గోదారి జలాలు జీవ కాలువలా వచ్చేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారన్నారు. గౌరవెల్లి భూనిర్వాసితులను రెచ్చగొట్టి పనులు ఆపేలా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. పీవీ సేవలను గత పాలకులు విస్మరించారని జడ్పీఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల అభివృద్ధి పనులను వచ్చే జయంతి లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.   సర్పంచి రజిత, ఎంపీటీసీ సభ్యురాలు కౌసల్య, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ సభ్యుడు వంగ రవీందర్‌, ఎంపీడీవో భాస్కర్‌, తహసీల్దార్‌ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.


‘రావి’ ఆకుపై ఆవిష్కృతం

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విద్యార్థులకు ఆర్ట్‌ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు ఆకులపై మహనీయుల చిత్రాలను చిత్రించి ఔరా అనిపిస్తున్నారు. వరంగల్‌ నగరానికి చెందిన గురుకుల ఆర్ట్‌ టీచర్‌ దేవరాయి రమేశ్‌ మంగళవారం దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చిత్రాన్ని రావి ఆకుపై చక్కగా చిత్రీకరించారు. మంగళవారం పీవీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రశంసలు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని