logo

దేశ ప్రగతి.. యువ భారత స్ఫూర్తి

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా ఇప్పటి వరకు దేశం సాధించిన ప్రగతి.. ఇంకా ఎలాంటి మార్పులు రావాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. తదితర అంశాలు తెలుసుకోవడానికి ‘ఈనాడు’ మూడు జిల్లాలో చర్చావేదికలు, మరో జిల్లాలో

Published : 14 Aug 2022 06:08 IST

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా ఇప్పటి వరకు దేశం సాధించిన ప్రగతి.. ఇంకా ఎలాంటి మార్పులు రావాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. తదితర అంశాలు తెలుసుకోవడానికి ‘ఈనాడు’ మూడు జిల్లాలో చర్చావేదికలు, మరో జిల్లాలో వాట్సాప్‌ సర్వే చేసింది. ఇందులో పాల్గొన్న యువత వారి అభిప్రాయాలు వెల్లడించారు.

వేగంగా అభివృద్ధి

చర్చావేదికలో ఉపాధ్యాయులు

రేగొండ : అభివృద్ధి పనులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరగాలని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండలోని వాణి విద్యానికేతన్‌ ఉన్నత పాఠశాలలో ‘స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. భారతదేశం ప్రగతి’పై చర్చావేదిక జరిగింది. అందరికి సమాన స్థాయిలో విద్య, వైద్యం అందలాంటే ఆ రెండు వ్యవస్థలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దేశం మరింత ప్రగతి పథంలో నడుస్తుందని’ ఉపాధ్యాయులు రాజు, ప్రకాష్‌, దీపిక, మాలతి వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. * రజనీకుమార్‌ మాట్లాడుతూ.. దేశం మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వరంగ వ్యవస్థలను ప్రైవేటు సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలన్నారు. * సంధ్యారాణి వివరిస్తూ.. ప్రభుత్వ ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలని, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా ప్రణాళిక రచించాలన్నారు.

ప్రజా నాయకుడు అవసరం

పాల్గొన్న ఎస్సార్‌ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల విద్యార్థినులు

బాలసముద్రం, న్యూస్‌టుడే : తమ, పర బేధం లేకుండా, కుల మతాలకతీతంగా జాతీయ ప్రయోజనాల కోసమే నాయకులు పని చేయాలని యువత అభిప్రాయపడింది. ‘నాయకులు ఎలా ఉండాలి’ అంశంపై నిర్వహించిన చర్చావేదికలో అడ్వకేట్స్‌ కాలనీలోని ఎస్సార్‌ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్ల్లడించారు. * ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ బాధ్యతగా ఉండాలని ఎం.హేమశ్రీ అభిప్రాయపడ్డారు. * పదవి కోసం కాదు ప్రజల కోసం పరితపించాలని వి.మమత పేర్కొన్నారు. * నాయకుడికి చెప్పుకుంటే సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం కల్పించాలని ఎ.ప్రణీత చెప్పారు. * పి.మమత మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. * వి.చంద్రకళ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారు నాయకుడైతే అన్ని విషయాలపై అవగాహన ఉంటుందన్నారు. * అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలని జి.రష్మిక అన్నారు. * హామీలు ఇవ్వడం కాదు.. నెరవేర్చడం ముఖ్యమని ఎం.ప్రణీత పటేల్‌ చెప్పారు. * సీీహెచ్‌.భానుశ్రీ మాట్లాడుతూ మహిళా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. * వంశపారంపర్య రాజకీయాలకు చరమగీతం పాడాలని, యువతకు అవకాశాలు కల్పించాలని మహేశ్వరి పేర్కొన్నారు.

విస్తృత విద్యావకాశాలు

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ, ఫార్మసీ కళాశాలలో ‘స్వాతంత్య్ర భారతావనిలో విద్యారంగ అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ దయాకర్‌ మాట్లాడారు. అధ్యాపకులు వాసంతి, సరిత పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మహిళా విద్యకు ప్రాధాన్యం పెరిగిందని.. పర్షిస్‌ అనే విద్యార్థిని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో సౌకర్యాల కల్పనతో ఉచితంగా విద్యను అందించడంతో నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని వైష్ణవి తెలిపారు. మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రాన్ని సాధించామని, సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలని భవానీ సూచించారు.


స్వాతంత్య్ర ఫలాలు.. అందరికీ అందాలి

ఆనాటి మహనీయుల కోరుకున్న విధంగా స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా అని ‘న్యూస్‌టుడే’ సర్వే నిర్వహించింది. జనగామ జిల్లాలో వాట్సప్‌ ద్వారా 75 మంది యువత, ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్లు ఇందులో భాగస్వాములయ్యారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. - జనగామ అర్బన్‌


బాలల ‘చిత్రం’

స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా చిత్రాలను గీసి పంపించాలని ‘ఈనాడు’ ఇచ్చిన పిలుపునకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. జాతీయభావాన్ని చాటేలా అనేక చిత్రాలను గీసి ఆకట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిత్రాలు రాగా వాటిలో నుంచి కొన్ని ఈరోజు మీ ముందుకు తెస్తున్నాం. - జనగామ అర్బన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని