logo

బదిలీలకు ని‘బంధనాలు’

ఓ వైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. మరోవైపు రాష్ట్రస్థాయి పైరవీలతో బదిలీలు చేస్తుండటంతో అయోమయం నెలకొంది.

Published : 30 Jan 2023 05:18 IST

ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
న్యూస్‌టుడే, భూపాలపల్లి

డీఈవో కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు

ఓ వైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. మరోవైపు రాష్ట్రస్థాయి పైరవీలతో బదిలీలు చేస్తుండటంతో అయోమయం నెలకొంది. విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం అర్హుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయడంతో పాటు సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. గ్రేడ్‌-2 గజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల బదిలీకి మొదట ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. తర్వాత అయిదేళ్లకు కుదించడంతో అందుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేశారు. డీఎస్సీ, రిజర్వేషన్‌ మెరిట్‌ ఆధారంగా జాబితాలు పొందుపర్చారు. అయితే.. వేర్వేరు పద్ధతుల్లో సీనియారిటీ జాబితాను తయారు చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

317 జీవోతో

317 జీవో ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొత్త స్థానికత అమలులో వారు గతంలో కోల్పోయిన సర్వీసును పరిగణించకపోవడంతో వారు జూనియర్లుగా గుర్తించబడుతున్నారు. కొందరు తమ స్పౌజ్‌ కేసులకు సంబంధించి పనిచేస్తున్న జిల్లా, జోన్‌లను విడిచి వేరొక జిల్లా, జోన్‌కు కేటాయించబడ్డారు. భార్యా భర్తలు వేరువేరు జిల్లాల్లో సుమారు వంద కిలోమీటర్లకు పైగా దూరంలో పనిచేయడంతో వారు మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేసి, తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు. ఇప్పటివరకు స్పౌజ్‌ కేసుల్లో జిల్లా నుంచి కేవలం 18 మంది బదిలీ అయ్యారు. ఇంకా బదిలీ కావల్సిన వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా భాషా పండితులకు పదోన్నతుల విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపడంతో వారు ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు భాషా బోధన నిలుపుదల చేస్తామని తెలంగాణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం డీఈవోకు వినతిపత్రాన్ని ఇచ్చారు. పైరవీలతో నిర్వహించే బదిలీలు నిలుపుదల చేయాలని, జీరో సర్వీసు బదిలీలకు అనుమతివ్వాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

కోర్టు పేరుతో నష్టం చేయకండి..
- గడ్డం లక్ష్మయ్య, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు

భాషా పండితులకు పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేయాలి. కోర్టు కేసుల సాకుతో ప్రభుత్వం భాషా పండితులపై నిర్లక్ష్య వైఖరి తగదు. వికలాంగుల కోటలో నిబంధనలు కచ్చితంగా పాటించి, పదోన్నతులు చేపట్టాలి. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి. వంద మార్కులకు బోధించే భాషా పండితులకు పదోన్నతులు కల్పించకుండా 50 మార్కులు బోధించే వారికి పదోన్నతులు కల్పించడం విడ్డూరం.

దొడ్డిదారిన తగదు..
- మధుసూదన్‌, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం చేపడుతున్న పదోన్నతులు, బదిలీల విషయంలో ఓవైపు అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సహకరించాలని కోరుతూనే దొడ్డిదారిన బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. స్థానికతను కోల్పోయి 317 జీవో ప్రకారం నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయకుండా, పెండింగ్‌ కేసులు పరిష్కరించకుండా, పూర్తి స్థాయిలో స్పౌజ్‌ కేసులకు సంబంధించి ఉపాధ్యాయులకు న్యాయం చేయకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదు.

స్పష్టమైన ఉత్తర్వులు రాకపోవడంతో..
- సుభాకర్‌రెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర విద్యాశాఖ నుంచి స్పష్టమైన రాతపూర్వక ఉత్తర్వులు విడుదల చేయకపోవటంతో జిల్లాకోలా సీనియారిటీ జాబితాలను రూపొందించడంతో కొందరు ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. కోర్టు కేసుల పేరుతో పండిట్‌, పీఈటీలకు పదోన్నతులు కల్పించకపోవడం సరైంది కాదు. జీరో సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని