logo

Warangal: అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ!

తెల్లవారితే తన పాపకు చెవులు కుట్టే శుభకార్యం ఉండడంతో ఆ తండ్రి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆ తండ్రి పిడుగు లాంటి వార్త వినడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Updated : 09 Feb 2023 08:04 IST

పాము కాటుతో చిన్నారి మృతి

మన్విత (పాత చిత్రం)

పర్వతగిరి, వర్ధన్నపేట న్యూస్‌టుడే: తెల్లవారితే తన పాపకు చెవులు కుట్టే శుభకార్యం ఉండడంతో ఆ తండ్రి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆ తండ్రి పిడుగు లాంటి వార్త వినడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ముద్దులొలికే మాటలు చెబుతూ నవ్వులతో పాఠశాలకు వెళ్లిన తన కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలిసి గుండెలు విలపించేలా రోదించారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామ శివారులోని బట్టు తండాలో బుధవారం చోటు చేసుకుంది.

స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బట్టు తండాకు చెందిన మెహన్‌-పార్వతిల కుమార్తె మన్విత(6) రోజులాగానే బుధవారం తండాలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. పాఠశాలలో మధ్యాహ్నం తరగతి గదిలో నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటుండగా పాము కాటు వేసింది. విద్యార్థిని మన్విత కాలు వద్ద విపరీతమైన మంట వస్తుండడంతో తోటి విద్యార్థులకు చెప్పగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పరిశీలించారు. వారికి పాఠశాల ఆవరణలో పాము కనిపించింది. వెంటనే పాపను పాము కాటువేసిందని గుర్తించి ఉపాధ్యాయులు, స్థానికులు ఓ వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. తెల్లవారితే బంధుమిత్రుల నడుమ తన కుమార్తెకు చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా ఇంతలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి రోదనలు చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ ఎస్సై దేవేందర్‌ను వివరణ కోరగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని తెలిపారు.

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని