logo

తూర్పు రాజకీయం.. రసవత్తరం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ తూర్పు శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది.

Updated : 03 Nov 2023 04:42 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ తూర్పు శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. కాకతీయులు పాలించిన ఖిలావరంగల్‌ కోట ఉంది. కిరాణం, అనాజ్‌, వస్త్రాలు, జనరల్‌ స్టోర్స్‌ హోల్‌సేల్‌ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా బాసిల్లుతోంది. వరంగల్‌ లక్ష్మిపురంలో కూరగాయలు, పండ్ల మార్కెట్‌ ఉంది. వ్యాపారులు, ఉద్యోగులు, మేధావులు, వివిధ రకాలైన వృత్తిదారులు, కార్మికులు, కర్షకులుంటారు. తూర్పు నియోజకవర్గం పూర్తిగా పట్టణ ప్రాంతం. గ్రేటర్‌ వరంగల్‌ విస్తీర్ణంలో ముఖ్యభూమిక పోషిస్తోంది. పేరుకు పట్టణమైనా ఖిలావరంగల్‌ కోట, ఉర్సు, రంగశాయిపేట, కరీమాబాద్‌, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, దేశాయిపేటలో ఇప్పటికి గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది. మురికివాడలు, పేదల బస్తీలున్నాయి. 

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

నియోజకవర్గం ముచ్చట

రాజకీయ నేపథ్యం

24 డివిజన్లు, సుమారు 3.50 లక్షల పైచిలుకు జనాభా ఉంటుంది. 2,46,367 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో వరంగల్‌ నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో వరంగల్‌ తూర్పుగా ఏర్పడింది.  ః తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజలింగం ఎన్నికయ్యారు. 1962, 1967లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బండారు నాగభూషణరావు, టీఎస్‌.మూర్తి గెలుపొందారు. ః 1952 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 కాంగ్రెస్‌, 3 తెదేపా, 2 తెరాస, 2 స్వతంత్రులు గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలోనూ కాంగ్రెస్‌ గెలుపొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో కొండా సురేఖ, నన్నపునేని నరేందర్‌ తెరాస తరఫున విజయం సాధించారు.

రెండుసార్లు మంత్రి పదవులు: వరంగల్‌ తూర్పునకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలో రెండు సార్లు మంత్రి పదవులు దక్కాయి. 1989లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన తక్కళ్లపెల్లి పురుషోత్తమరావు, 1993లో దివంగత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి మండలిలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి పదవి వరించింది. 1999 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన బస్వరాజు సారయ్య 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

ఈసారి త్రిముఖ పోరు..

  • గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి పోటీ ఎక్కువగా ఉంటుంది. భారాస, కాంగ్రెస్‌, భాజపాల మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశాలున్నాయి.
  • మూడేళ్ల పాటు మేయర్‌గా పనిచేసిన నన్నపునేని నరేందర్‌ 2018లో తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన భారాస నుంచి బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
  • శాయంపేట, పరకాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, దివంగత వైఎస్సాఆర్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2014లో  తూర్పు నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2018లో కాంగ్రెస్‌లో చేరి పరకాల నుంచి ఓటమి పాలయ్యారు.
  • భాజపా అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పదిహేనేళ్లుగా వరంగల్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్నారు. వ్యాపారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

ఓటర్ల వివరాలు

పురుషులు 1,20,323

మహిళలు 1,25,621

ట్రాన్స్‌జెండర్లు 338

మొత్తం ఓటర్లు: 2,46,282

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని