logo

రోజుకో మలుపు.. పోలీసు శాఖలో కుదుపు

సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇందులో ఉమ్మడి వరంగల్‌కు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తుండడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Updated : 27 Mar 2024 08:21 IST

ఓరుగల్లు చుట్టూ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు

ఈనాడు, వరంగల్‌: సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇందులో ఉమ్మడి వరంగల్‌కు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తుండడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో పలువురు నిందితులకు వరంగల్‌తో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సంబంధాలు ఉండడం పోలీసు శాఖను కుదుపేస్తోంది.

ఊహాగానాలు అనేకం

ఈ కేసులో పలువురిని హైదరాబాద్‌ పోలీసులు విచారిస్తుండగా సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి. రోజుకొకరి పేరు తెరపైకి వస్తుండడంతో పోలీసు వర్గాల్లో ఆందోళన మొదలైంది.  ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. ట్యాపింగ్‌లో ఎవరెవరు పాలుపంచుకున్నారు. ఎంతమంది నెంబర్లను ట్యాపింగ్‌ చేశారు? అసలు వార్‌రూంలను వరంగల్‌లో ఏర్పాటుచేశారా అన్న అనేక రకాల అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది.

ఇక్కడివారే..

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు స్వస్థలం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల. ఆయన గత ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా పనిచేశారని,  ట్యాపింగ్‌లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

మరో కీలక నిందితుడు ‘ఎస్‌ఐబీ’ విభాగంలో పనిచేసిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు స్వస్థలం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లి. ఆయన అమ్మమ్మగారిల్లు పర్వతగిరి. ట్యాపింగ్‌ చేసేందుకు ఒక వార్‌రూంను పర్వతగిరిలోనే ఏర్పాటు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

భుజంగరావు అరెస్టుతో..

వరంగల్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారని ఇటీవల దుమారం చెలరేగినా నిర్ధారణ కాలేదు. ఆ మర్నాడే ట్యాపింగ్‌ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు పాత్రపై ఆరోపణలు వచ్చాయి. ప్రణీత్‌రావు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉందన్న సమాచారంతో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును మార్చి 23న హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకు ఆయన ఇంటెలిజెన్స్‌ పొలిటికల్‌ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో భుజంగరావు పాత్రపై దర్యాప్తు బృందం ఆయన్ను ప్రశ్నించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన  భూపాలపల్లి  అదనపు ఎస్పీగా వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని