logo

ప్రయాణం చవక..పార్కింగ్‌ భారం

వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు.

Updated : 28 Mar 2024 05:28 IST

రైల్వేస్టేషన్లలో దోపిడీ

ఖమ్మంలోని ఓ డిగ్రీ కళాశాల లెక్చరర్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నిత్యం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. వెళ్లి రావడానికి రూ.120 టికెట్‌కు ఖర్చవుతోంది. ద్విచక్ర వాహనానికి పార్కింగ్‌ ఛార్జీ కింద ఉదయం నుంచి సాయంత్రానికి రూ.160 చెల్లించాల్సి వస్తోంది.


కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ ఇటీవల కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లేందుకు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. కారు పార్కింగ్‌ కోసం రోజుకు రూ.240 చొప్పున, రెండు రోజులకు కలిపి రూ.480 చెల్లించమనడంతో కంగుతిన్నారు. వరంగల్‌ నుంచి తిరుపతికి రైలు టికెట్‌ రూ.533 ఉంటే పార్కింగ్‌ కోసం రూ.480 ఏమిటని పార్కింగ్‌ నిర్వాహకులను నిలదీయడంతో రూ.80 తగ్గించారు.

గిర్మాజీపేట, న్యూస్‌టుడే: వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. వీరంతా తమ వాహనాలను స్టేషన్‌లోని పార్కింగ్‌ ఏరియాలో ఉంచాలి. ఇక్కడి ఛార్జీలు వారికి చుక్కలు చూపిస్తున్నాయి.


ఇదీ పరిస్థితి..  

  • రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌ ఏరియాలో తొలి 2 గంటలకు 18 శాతం జీఎస్టీతో కలుపుకొని రూ.20, ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున ఛార్జీ రెట్టింపవుతోంది.  స్టేషన్‌లో 24 గంటల పార్కింగ్‌ ఛార్జీ చెల్లించే మొత్తంతో వరంగల్‌ నుంచి విజయవాడకు, తిరిగి విజయవాడ నుంచి వరంగల్‌కు సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో ప్రయాణించొచ్చు.
  • ‘వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు ముందూ వెనుక రెండువైపులా పార్కింగ్‌ స్థలాలున్నాయి. నిబంధనల ప్రకారం కంప్యూటర్‌ జనరేటెడ్‌ రసీదు ఇవ్వాల్సి ఉండగా.. ముద్రించిన కాగితాలను ఇస్తున్నారు. నిర్ణీత సమయం గడిచిన తర్వాత రూ.50 నుంచి రూ.200 వరకు ఇష్టారీతిగా వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.
  • ఈ విషయంపై వరంగల్‌ రైల్వేస్టేషన్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌ను వివరణ కోరగా పార్కింగ్‌ ఏరియాల్లో నిబంధనలు మేరకే ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పారు.  అదనంగా  వసూలు చేస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు.
  • పార్కింగ్‌ టెండర్‌ కోసం ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు జీఎస్టీతో కలిపి రూ.33.50 లక్షలు చెల్లించాల్సిన కారణంగా.. నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
  • నిర్దేశించిన స్థలం వాహనాలతో నిండిపోతుండటంతో స్టేషన్‌ ఆవరణలో ఎండలోనే నిలపాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.

బస్టాండులో రూ.20.. రైల్వేస్టేషన్‌లో రూ.60

- హరి, ధర్మారం, గీసుకొండ

మహబూబాబాద్‌లోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న నా కుమారుడిని చూసేందుకు   ప్యాసింజర్‌ రైళ్లో వెళ్లాను. రైలు టికెట్‌కు రానుపోను రూ.60 మాత్రమే ఖర్చయ్యింది. పార్కింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని తీసుకోవడానికి అదేరోజు మధ్యాహ్నం వెళితే రూ.60 చెల్లించాలన్నారు. పక్కనే ఉన్న వరంగల్‌ బస్టాండులో ప్రతిసారి రూ.20కే పార్కింగ్‌ చేసేవాడిని.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని