logo

వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు

జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రం, రేడియాలజీ హబ్‌లను ఏర్పాటు చేసింది.

Published : 29 Mar 2024 06:00 IST

అలంకారప్రాయంగా టుడీ-ఈకో యంత్రం

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రం, రేడియాలజీ హబ్‌లను ఏర్పాటు చేసింది. డయాగ్నస్టిక్‌ కేంద్రంలో రక్త, మూత్ర సంబంధిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. రేడియాలజీ హబ్‌లో ఈసీజీ, ఎక్స్‌రే, మామోగ్రామ్‌, యూఎస్‌ స్కానింగ్‌ సౌకర్యాలతో పాటు గుండె పరీక్షలు చేయడానికి రూ.15 లక్షల వ్యయంతో టుడీ-ఈకో యంత్రం అందుబాటులోకి తీసుకువచ్చారు. రేడియాలజీ హబ్‌ ఏర్పాటై ఏడాది గడుస్తోంది. అయితే ఏడాది కాలంగా రేడియాలజీ హబ్‌లో టుడీ-ఈకో పరీక్షలు చేసేందుకు అవసరమైన రేడియాలజీ వైద్యుడు, కార్డియాలజిస్ట్‌ వైద్యుడు లేకపోవడంతో టుడీ-ఈకో యంత్రం అలంకారప్రాయంగా మారిందని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక యంత్రాలను సమకూర్చిన ప్రభుత్వం హబ్‌లో వైద్యులను నియమించకపోవడంతో రోగులకు సేవలందించాల్సిన రేడియాలజీ హబ్‌లోని గుండె పరీక్షల విభాగం నిరుపయోగంగా మారింది.

 ప్రైవేటులో ఎక్కువ ఖర్చు

టుడీ-ఈకో యంత్రం ఉన్న నిరుపయోగంగా మారడంతో జిల్లాలోని 12 మండలాల ప్రజలు ప్రభుత్వ పరిధిలో ఉచితంగా గుండె పరీక్షలు చేసే విభాగం లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో గుండె పరీక్షకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, తీసుకునే ఆహార అలవాట్లతో ఎక్కువ మంది అధిక రక్తపోటు సమస్యతో గుండె సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. గుండె పరీక్షలు చేసే టుడీ-ఈకో యంత్రంతో కార్డియాలజిస్ట్‌, రేడియాలజిస్ట్‌ వైద్య పరీక్షలు చేస్తే సదరు వ్యక్తి గుండె సంబంధిత సమస్యలు సకాలంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన చికిత్స, స్టంట్‌లు వేసుకోవడం, బైపాస్‌ సర్జరీ వంటివి చేయించుకుంటారు. ఇంత అత్యవసరమైన టుడీ-ఈకో యంత్రం మొక్కుబడిగా ఏర్పాటు చేసి పరీక్షలు చేసే వైద్యుడిని నియమించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రేడియాలజీ హబ్‌లోని టుడీ-ఈకో యంత్రం ప్రజలకు ఉపయోపడే విధంగా సంబంధిత వైద్య పరీక్షలు చేసే వైద్యుడిని నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

- శ్రీనివాస్‌, రేడియాలజీ హబ్‌ ఇన్‌ఛార్జి

రేడియాలజీ హబ్‌లో టుడీ-ఈకో యంత్రం విభాగంలో వైద్యుడు లేకపోవడంతో పరీక్షలు చేయలేకపోతున్నాం. ఈ సమస్యను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వైద్యుడిని నియమిస్తే టుడీ-ఈకో సేవలు అందుబాటులోకి వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని