logo

భారాసకు కడియం ఝలక్‌!

అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు.

Published : 29 Mar 2024 06:29 IST

కావ్య లేఖతో ఓరుగల్లులో కారు మరింత డీలా
కాంగ్రెస్‌ తరఫున పోటీ?

ఈనాడు, వరంగల్‌: అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. ఒక్క స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాత్రమే గులాబీ జెండా రెపరెపలాడింది. ఆ ఒక్క స్థానంలో గెలిచి పార్టీని కొన ఊపిరితో నిలిపిన కడియం శ్రీహరి సైతం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలతో ఇక తాను ఉండలేననే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. తండ్రి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకోవాలనుకుని భారాస నుంచి పోటీకి సై అన్న కావ్య అంతలోనే పోటీ నుంచి వైదొలగడం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ పరిణామాలతో లోక్‌సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి వరంగల్‌లో భారాసకు ఊహించిన షాక్‌ తగిలిందని చెబుతున్నారు.


మూడు రోజుల కిందట.. భారాస నుంచి తనకు అవకాశం ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


రెండు రోజుల కిందట.. కారులో లోక్‌సభకు పయనమైన తనకు మద్దతు ఇవ్వాలంటూ హుషారుగా ప్రచారం సాగించారు.


నిన్న రాత్రి.. వెల్లువెత్తుతున్న ఆరోపణలు, భూ కుంభకోణాలతో కుదేలవుతున్న భారాస  నుంచి పోటీ చేయలేనని ప్రకటించారు..  


వైద్యురాలైన కడియం కావ్య గులాబీ పార్టీకి ఇలా ఝలక్‌ ఇచ్చారు.. టికెట్టు కూడా పొందాక మనసు మార్చుకుని కారు గుర్తుపై పోటీ చేయనంటూ ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది.


మరింత ఉత్కంఠ

కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి మార్గనిర్దేశంలోనే ప్రతి అడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో భారాస పోటీ నుంచి విరమించుకోవడం కూడా కడియం సూచనల ప్రకారమే చేశారని సమాచారం. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఖాయమే అన్న చర్చ జోరుగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ కీలక నేతలు ఆయనతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. కడియం శ్రీహరి ఎంతో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. గతంలో భారాస నుంచి వరంగల్‌ లోక్‌సభ స్థానంలో ఆయన నెగ్గారు. ఉపముఖ్యమంత్రి పదవి పొందేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన కూతురు కావ్య ఇప్పుడు వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా పార్టీ అవకాశం ఇవ్వడంతో శ్రీహరి భారాసలోనే కొనసాగుతారని అంతా భావించారు. తాజాగా పార్టీలో జరిగిన పరిణామాలు, కీలక నేతలు కాంగ్రెస్‌ గూటికి చేరడంతో ఇక కడియం సైతం హస్తంతో ‘చేయి’ కలిపేందుకే సిద్ధమైనట్టు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్‌ వరంగల్‌ అభ్యర్థిగా కావ్యనే బరిలోకి దిగుతారని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని