logo

ఓట్టేద్దాం..ఓరుగల్లు వైభవాన్ని కాపాడుదాం

ఉమ్మడి వరంగల్‌ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి.

Published : 18 Apr 2024 06:26 IST

దేఖో అప్నాదేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌ 2024 ద్వారా అవకాశం
నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం 
ఈనాడు, వరంగల్‌

రామప్ప దేవాలయం

ఉమ్మడి వరంగల్‌ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేక వీటిలో కొన్ని మరుగున పడుతున్నాయి. మీరు వాటిని చూసినప్పుడు ‘అయ్యో ఇంత అద్భుత కట్టడాలకు ఈ దుస్థితి ఎందుకు’ అని బాధపడ్డారా? మీరు ఆన్‌లైన్‌లో ఒక ఓటు వేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం వాటిని బాగు చేసే అవకాశం ఉంది. గురువారం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలా ఓటు వేయాలో వివరిస్తూ ప్రత్యేక కథనం..

ఇదీ వెబ్‌సైట్

https:///innovateindia.mygov.in/dekho-apna-desh/

పాండవుల గుట్ట

ఏమిటీ కార్యక్రమం?

దేశంలో అనేక రకాల పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని బాగు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చిలో జమ్మూకశ్మీర్‌లో పర్యటించినప్పుడు ‘దేఖో అప్నాదేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించారు.

5 విభాగాలుగా..

ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, వారసత్వ, ప్రకృతి, అడవులు, సాహసోపేత ప్రాంతాలు, ఇతర ప్రాంతాలుగా అయిదు రకాల సందర్శనీయ స్థలాలను విభజించారు.

ప్రయోజనం ఏమిటి?

ఈ నెల 30 ఓటింగ్‌కు చివరి తేదీ. ఆ తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి అవకాశాన్ని బట్టి ప్రజలు కోరిన వసతులు కల్పించేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు పాండవుల గుట్ట వద్ద బస లేదని ఎక్కువ మంది పేర్కొంటే అక్కడ ఒక హోటల్‌ నిర్మించే అవకాశం ఉంది. వరంగల్‌ కోటలో పారిశుద్ధ్యం సరిగా లేదని నెటిజన్లు అభిప్రాయపడితే అక్కడి పరిసరాలు బాగు చేసే వీలుంది.

దేఖో అప్నా దేశ్‌ పీపుల్‌ చాయిస్‌ 2024 ధ్రువపత్రం

ఓరుగల్లువాసులు.. వేటికి ఓటేయొచ్చు?

  • ఉమ్మడి వరంగల్‌లో వారసత్వ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న రామప్ప ఆలయం, వరంగల్‌ కోట, వేయిస్తంభాల గుడిని ఇందులో చేర్చారు. పాండవుల గుట్ట గుహలు కూడా ఉన్నాయి.
  • ఆధ్యాత్మిక ప్రదేశాల కింద భద్రకాళి ఆలయం, మెట్టుగుట్ట, ఐనవోలు, కురవి..
  • వైల్డ్‌లైఫ్‌ కింద ఏటూరునాగారం అభయారణ్యం, పాకాల సరస్సు, రామప్ప చెరువు, లక్నవరం..  
  • ఇలా ఎన్నో ప్రదేశాలను ఎంపిక చేసి అక్కడ లేని వసతులను ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. దేశంలో మీరు కోరుకున్న మరే ప్రాంతానికైనా ఓటేయొచ్చు. ఇలా ఓటేసినందుకు మీకు ఒక ప్రశంసా పత్రం కూడా వస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏం చేయాలి?

మరుగున పడ్డ పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు వెబ్‌సైట్లోకి వెళ్లి ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో పాల్గొనాలి. సైట్లోకి వెళ్లాక ‘ఓట్ నౌ’ పై క్లిక్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మీ పేరు, వివరాలు, చిరునామా అందులో నింపాలి. తర్వాత మీరు ఎంపిక చేసే విభాగాల్లోకి వెళ్లి, ఓటేయాల్సిన ప్రాంతం.. ఆ జాబితాలో ఉందో సరిచూసుకోవాలి. అక్కడ కల్పించాల్సిన వసతుల పట్టిక పక్కన ఉంటుంది. దాన్నుంచి ఎంపిక చేసుకోవాలి. రవాణా, పారిశుద్ధ్యం, ఇతర వసతులన్నీ పదిరకాలు ఉంటాయి. వాటిల్లో కావాల్సింది ఎంపిక చేసుకోవాలి.

ఉదాహరణకు వేయిస్తంభాలగుడిని ఎంపిక చేస్తే అక్కడ ఏమేం వసతులు కోరుకుంటున్నారో సైట్లో పొందుపరచవచ్చు.


నేను ధ్రువపత్రం పొందా

- అగ్నిశర్మ గాడేపల్లి, వైద్య విద్యార్థి, హనుమకొండ

ఉమ్మడి వరంగల్‌లో ఉన్న పలు వారసత్వ ప్రాంతాలు, సహజ వింతల కోసం నేను ఓటేశా. దేఖో అప్నాదేశ్‌ పీపుల్‌ ఛాయిస్‌ వెబ్‌సైట్లోకి వెళ్లి రిజిస్టర్‌ చేసుకున్నా. ఓటింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొంటే మన పర్యాటక ప్రాంతాలు బాగుపడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని