logo

రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 01 May 2024 05:57 IST

జ్యోతికిరణ్‌, వెంకటేష్‌ (పాతచిత్రాలు)

తాడ్వాయి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన కొప్పుల వెంకటేష్‌(19), అదే మండలంలోని పాత్రాపురం గ్రామానికి చెందిన కొండపర్తి జ్యోతికిరణ్‌(19), వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పాయం రక్షిత్‌(18) ముగ్గురు ప్రాణస్నేహితులు. వీరు ఉదయం ద్విచక్రవాహనంపై వచ్చి ములుగులో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు రాశారు. తిరుగు ప్రయాణంలో పస్రా దాటిన తర్వాత అటవీ శాఖ చెక్‌పోస్టు సమీపంలో గుర్తుతెలియని వాహనం డీకొట్టడంతో జ్యోతికిరణ్‌, వెంకటేష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రక్షిత్‌ను వాహనదారులు గుర్తించి అంబులెన్స్‌లో ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


కుటుంబ కలహాలతో నిట్‌ ఉద్యోగి బలవన్మరణం

హిమాన్షు గుప్తా (పాతచిత్రం)

గిర్మాజీపేట, న్యూస్‌టుడే: వివాహం జరిగి ఏడాది పూర్తయ్యింది.. అంతలోనే భార్యాభర్తల మధ్య కలహాలు తలెత్తడంతో ఓ యువ ఇంజినీర్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌ జిల్లా మోదీనగర్‌కు చెందిన హిమాన్షు గుప్తా(33) వరంగల్‌ నిట్‌లో జూనియర్‌ సివిల్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాజీపేట ప్రశాంత్‌నగర్‌లో భార్యతో కలిసి నివసిస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. 15రోజుల క్రితం ఇరువురి కుటుంబసభ్యులు వచ్చి ఇద్దరికీ నచ్చజెప్పి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి మళ్లీ గొడవ జరగడంతో.. మంగళవారం ఉదయమే హిమాన్షు గుప్తా ఆవేశంతో ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లారు. మనస్తాపంతో కాజీపేట- వరంగల్‌ రైల్వేస్టేషన్ల మధ్య శాయంపేట రైల్వేగేట్‌ సమీపంలో టీజే గూడ్సు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే భయాందోళనకు గురైన భార్య(మూడునెలల గర్భిణి) తన భర్త ఆవేశంగా బయటికి వెళ్లాడని డయల్‌ 100కు ఫోన్‌ చేయగా.. కాజీపేట పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. రైల్వేట్రాక్‌ పక్కన నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం ఆధారంగా మృతుడి వివరాలను కాజీపేట పోలీసులకు తెలియజేయడంతో హిమాన్షు గుప్తాగా నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని