logo

సర్దుకుపోవాల్సిందే!

ఆసుపత్రి శస్త్రచికిత్స థియేటర్‌లో ఐదుగురు నర్సులు అవసరం కాగా ఇద్దరమే ఉన్నాం. ఉదయం 8 గంటలకు హాజరై సాయంత్రం వరకు విధుల్లో ఉంటాం. రాత్రి వేళ అత్యవసర కేసులు వస్తే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్తున్నాం. ఒక్కోసారి తిరిగి ఇంటికి చేరే సరికి తెల్లవారిపోతుంది.

Published : 28 May 2022 04:47 IST

వైద్య సిబ్బంది కొరతతో అవస్థలు

భీమవరం పట్టణం, బృందం, న్యూస్‌టుడే

ఆసుపత్రి శస్త్రచికిత్స థియేటర్‌లో ఐదుగురు నర్సులు అవసరం కాగా ఇద్దరమే ఉన్నాం. ఉదయం 8 గంటలకు హాజరై సాయంత్రం వరకు విధుల్లో ఉంటాం. రాత్రి వేళ అత్యవసర కేసులు వస్తే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్తున్నాం. ఒక్కోసారి తిరిగి ఇంటికి చేరే సరికి తెల్లవారిపోతుంది. మళ్లీ 8 గంటలకు ఆసుపత్రికి వెళ్లి బయోమెట్రిక్‌ వేయాలి. ఇలా తరచూ ఇబ్బందులు పడుతున్నాం. - జిల్లాలో ఓ నర్సు ఆవేదన ఇది

రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధంతో పాటు దగ్గరుండి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించే నర్సుల సేవలు కూడా ముఖ్యమే. ప్రభుత్వాసుపత్రిల్లో కొన్నేళ్లుగా నర్సులు, సహాయకుల కొరత వేధిస్తోంది. శస్త్ర చికిత్స చేసే సమయంలో, అనంతరం వార్డులో చేర్చాక రోగిన అవసరమైన మందులు ఇస్తూ వారి బాగోగులను పర్యవేక్షించాల్సిన బాధ్యత సహాయ సిబ్బందిదే. అత్యవసర సమయాల్లో రోగిని రక్త, స్కానింగ్‌ పరీక్షలకు దగ్గరుండి తీసుకెళ్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైద్యుల కంటే ముందుగా పరుగెత్తికొచ్చేది నర్సులు, సహాయ సిబ్బందే. కొవిడ్‌ సమయంలో సైతం వీరు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ బాధితులకు ధైర్యం చెబుతూ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించారు.

గత కొన్నేళ్లుగా కొత్తగా వైద్య సిబ్బంది నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో ఏర్పడిన ఖాళీలు భర్తీకి నోచుకోవడం లేదు. ఉద్యోగోన్నతితో ఎవరైనా బదిలీపై వెళ్తే ఆ పోస్టు బాధ్యతలను మిగిలిన సిబ్బంది పంచుకోవాల్సిందే. అత్యవసరంగా ఎవరైనా సెలవులో వెళ్తే భారం మరింత పెరుగుతోంది.

వైద్యులకు సహాయకులుగా నర్సులతోపాటు ఎఫ్‌.ఎన్‌.వో, ఎం.ఎన్‌.ఒ.లు ఉండాలి. పలు ఆసుపత్రుల్లో ఇలాంటి సిబ్బందే లేరు. రహదారి ప్రమాదాల్లో క్షతగాత్రులకు కట్లు, కుట్లు వేసేవారు లేరంటే ప్రభుత్వ దవాఖానాల్లో సేవలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్ఛు

భీమవరం ప్రభుత్వాసుపత్రికి నిత్యం 350 మందికి పైగా రోగులు వస్తారు. వీరిలో కొందరికి శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. మరికొందరు ఆసుపత్రుల్లోనే ఉంటూ చికిత్స పొందుతారు. రోగులకు తగిన సంఖ్యలో నర్సులు, సహాయ సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారే క్యాజువాలిటీ, వార్డుల్లో, ప్రసూతి విభాగంలో క్షణం తీరికలేకుండా పనిచేయాల్సి వస్తోంది.

ఆచంట, పెనుగొండ ఆసుపత్రుల్లో ఇద్దరు చొప్పున సహాయకులు అవసరం కాగా ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆకివీడు సీహెస్‌సీలో ఆరుగురు నర్సులు అవసరం కాగా నలుగురు మాత్రమే ఉన్నారు.

వైద్య సిబ్బంది కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపామని భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకుడు వీరాస్వామి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని