logo

నిశిరాత్రి దోపిడీలు

నిశిరాత్రి.. చుట్టూ చిమ్మచీకటి.. జాతీయ రహదారిపై దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు కాస్త విశ్రాంతి తీసుకుందామని చిన్న దాబాలు, టీ దుకాణాల సమీపంలో తమ వాహనాలు నిలిపి సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా దాడి.

Published : 03 Feb 2023 02:17 IST

వాహనదారులను కొట్టి నగదు, నగల అపహరణ
తాజా ఘటనతో జనం భయాందోళన
ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే

నిశిరాత్రి.. చుట్టూ చిమ్మచీకటి.. జాతీయ రహదారిపై దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు కాస్త విశ్రాంతి తీసుకుందామని చిన్న దాబాలు, టీ దుకాణాల సమీపంలో తమ వాహనాలు నిలిపి సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా దాడి. ఎటువైపు నుంచి వస్తారో తెలియదు.. నలుగురైదుగురు విరుచుకుపడతారు. కారు అద్దాలు పగులకొడతారు.. లోపలున్న వారిని కొట్టి నగలు, నగదు దోచుకుపోతారు. సినిమాలో సన్నివేశాలను తలపించే ఇలాంటి ఘటనలు గతంలో ఏలూరు శివారు జాతీయరహదారిపై జరిగేవి. అలాంటి నేరమే తాజాగా గురువారం తెల్లవారుజామున చోటు చేసుకోవడంతో జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్పట్లో వరుస ఘటనలు

నగర శివారు జాతీయ రహదారి అంటే గతంలో హడల్‌.. కలపర్రు టోలు గటు నుంచి ఆశ్రం ఆసుపత్రి వరకు సుమారు 20 కిలోమీటర్ల ఈ మార్గంలో రాత్రివేళల్లో నేరాలు జరిగేవి. వాహనాలను ఆపి దొంగలు దోచుకోవడం, ఆపిన వాహనాల్లోకి చొచ్చుకుపోయి నేరాలకు పాల్పడటం వంటివి చేసేవారు. రెండేళ్ల కిందట కలపర్రు టోలుగేటు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే రెండేళ్ల కిందట ఏలూరు శివారు ఓ బార్‌ సమీపంలో ఓ డ్రైవర్‌ తన లారీని రహదారి పక్క ఆపి నిద్రిస్తుండగా దుండగులు దాడి చేసి కత్తితో పొడిచి గాయపరిచారు. నగదు దోచేశారు. ఏడాది కిందట విజయవాడ వైపు వెళ్తున్న ప్రయాణికుడిని లిప్టు అడిగిన ఓ ఆగంతుకుడు మార్గం మధ్యలో నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి దాడి చేసి డబ్బు దోచుకున్నారు. అలాగే ఏలూరు మినీ బైపాస్‌లో కూడా రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులను అడ్డగించి చరవాణులు, నగదు దోచుకునే వారు.

మళ్లీ మొదలైందా?

వరుస నేరాల నేపథ్యంలో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించి నేరాలకు అడ్డుకట్ట వేయగలిగారు. నగరంలోని బీడీ కాలనీ, చెంచుల కాలనీ, తంగెళ్లమూడి ప్రాంతాలకు చెందిన 19 మందిని అరెస్టు చేశారు. అడపాదడపా చిన్న చిన్నవి జరుగుతున్నా.. మళ్లీ ఇప్పుడు గతాన్ని తలపించేలా నేరం జరగడంతో పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. బాధితుల వద్ద వివరాలు సేకరించి నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం

జాతీయ రహదారిపై నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టాం. ఈ తరహా నేరాలు మళ్లీ జరగకుండా చూస్తాం.  దాబా హోటళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఏలూరు ఇన్‌ఛార్జి డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు తెలిపారు.


బెదిరించి 15 కాసుల బంగారం కాజేత

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఏలూరు నగర శివారు జాతీయ రహదారిలో దారి దోపిడీ జరిగింది. కారులో నిద్రిస్తున్న వ్యక్తులను కొంతమంది దుండగులు బెదిరించి బంగారు ఆభరణాలను కాజేశారు. ఏలూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌  జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి చెందిన బబ్బిత కవిత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరుగుతున్న బంధువుల వివాహానికి తన మనవడు, మరో కుటుంబ సభ్యుడితో కలిసి కారులో బయలు దేరారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటాక ఏలూరు శివారు జాతీయరహదారి పక్కనే ఉన్న రత్నాబార్‌ సమీపంలోని సర్వీసు రోడ్డులో కారు ఆపి అంతా నిద్రపోయారు. ఈ క్రమంలో కవిత టాయిలెట్‌కు వెళ్లి వచ్చి.. మళ్లీ కారు ఎక్కుతుండగా కొందరు ఆగంతుకులు వచ్చారు. నగలు, నగదు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఆమె ధరించిన బంగారు హారం, నెక్లెస్‌, గొలుసు, చెవి దిద్దులతో పాటు 15 కాసుల ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కోడేరు ఇసుక రీచ్‌పై దాడులు
మూడు పొక్లెయిన్లు, నాలుగు వాహనాల స్వాధీనం

ఆచంట, న్యూస్‌టుడే: అక్రమాలకు అడ్డాగా మారిన ఆచంట మండలం కోడేరు ఇసుక రీచ్‌పై గురువారం రాత్రి అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నరసాపురం సబ్‌కలెక్టరు సూర్యతేజ ఆదేశాలతో మండల ఇన్‌ఛార్జి తహశీల్దారు ఆర్‌.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో జగన్నాథరావు, పెనుగొండ ఎస్సై సురేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో సుమారు 30 మంది సిబ్బంది ఏకకాలంలో ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూడు పొక్లెయిన్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జేపీ సిబ్బందితో పాటు రీచ్‌ నిర్వహణ చూస్తున్న అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బిల్లులు సైతం లేకుండా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వైనంపై ‘గోదారి గర్భంలో తోడేస్తున్నారు’ శీర్షికతో జనవరి 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని