logo

ఏడాది కిందటే సిద్ధం.. ప్రారంభంపై సందిగ్ధం!

నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఎప్పుడు ఏర్పాటవుతుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి 2021లో ప్రతిపాదనలు పంపగా 2022లో ఆమోదం లభించింది.

Published : 23 Mar 2023 04:09 IST

నూజివీడు కేంద్రీయ విద్యాలయ తాత్కాలిక భవనాలు

నూజివీడు, న్యూస్‌టుడే: నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఎప్పుడు ఏర్పాటవుతుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి 2021లో ప్రతిపాదనలు పంపగా 2022లో ఆమోదం లభించింది. అనంతరం స్థానిక ఏరియా ఆసుపత్రి ప్రాంతంలో ట్రిపుల్‌ ఐటీ పక్కన తరగతి గదులు, సిబ్బంది వసతి గృహాలు తదితరాలకు ఏడు ఎకరాల స్థలం కూడా కేటాయించారు. తరగతులను వెంటనే ప్రారంభించాలన్న ఉద్దేశంతో మున్సిపల్‌ సాధారణ నిధులు, ఎంపీ ల్యాడ్స్‌తో పాటు ఇతర సంస్థల నుంచి నిధులు సేకరించి రూ.80 లక్షలతో స్థానిక ఎంప్లాయీస్‌ కాలనీలో తాత్కాలిక భవనాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. అవి గతేడాది ప్రారంభంలోనే సిద్ధం కావడంతో కేంద్రీయ విద్యాలయ అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భవనాలతో పాటు శాశ్వత కట్టడాల కోసం కేటాయించిన భూమిని సైతం వారికి అప్పగించారు. కానీ గతేడాది తరగతులు ప్రారంభం కాక పోవడంతో నూజివీడు ప్రాంత ప్రజలకు నిరాశ తప్పలేదు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎమ్మెల్యే అప్పారావు సమస్యను దిల్లీలోని కేంద్రీయ విద్యాలయాల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకూ స్పష్టత రాలేదు. దీంతో సదరు విద్యా సంస్థకు కేటాయించిన స్థలం, రూ.80 లక్షల వ్యయం వృథా అవుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే జూన్‌లో ప్రవేశాలు మొదలవుతాయి. ఈ లోపు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాలతో పాటు అవసరమైన సామగ్రి సమకూర్చాల్సి ఉంటుంది.


దీనిపై సబ్‌ కలెక్టర్‌ ఆదర్ష్‌ రాజీంద్రన్‌ మాట్లాడుతూ  అవసరమైన భూమిని అప్పగించామని, కేంద్రీయ విద్యాలయ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఎమ్మెల్యే అప్పారావు మాట్లాడుతూ దిల్లీ వెళ్లి అధికారులతో మాట్లాడి ఈ ఏడాది తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని