logo

నైపుణ్యానికి పదును.. స్వయం ఉపాధికి అడుగులు

తమలో ఉన్న నైపుణ్యానికి ఆసక్తితో మరింత పదును పెడుతూ స్వయం ఉపాధిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.. కేఆర్‌పురానికి చెందిన గిరిజన మహిళలు.

Published : 23 Mar 2023 04:38 IST

గిరిజన మహిళల స్ఫూర్తి

అల్లికలతో చేసిన గృహాలంకరణ

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: తమలో ఉన్న నైపుణ్యానికి ఆసక్తితో మరింత పదును పెడుతూ స్వయం ఉపాధిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.. కేఆర్‌పురానికి చెందిన గిరిజన మహిళలు. శిక్షణ పొందుతూ వెదురు, నూలు దారం, లేసులతో అల్లికలు, గాజులు, వృథాగా ఉన్న కాగితపు అట్టలు, పేక ముక్కలు, అందుబాటులో ఉన్న వివిధ రకాల వస్తువులను వినియోగించి గృహోపకరణ, అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. వాటికి ఆకట్టుకునే విధంగా రంగులు అద్ది మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుతున్నారు. కేంద్ర హస్త కళల అభివృద్ధి కమిషనర్‌, టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వశాఖ ద్వారా ఏపీ ఇండస్ట్రియల్‌, టెక్నికల్‌ కన్సల్టెన్సీ సంస్థ(అపిట్కో) ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి వీరిని ప్రోత్సహిస్తున్నారు. ఈ గ్రామంలో 22 మంది గిరిజన మహిళలకు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు.

బాతు ఆకారంలో  తీర్చిదిద్ది


ఉపాధి పనులు చేస్తూ..

-కొమరం రత్నకుమారి

నేను ఇంటర్‌ చదివి, హిందీ పండిట్‌ శిక్షణ పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. తండ్రి వెంకటేశ్‌ చనిపోయారు. అమ్మ, సోదరుల దగ్గర ఉంటున్నాను. ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నాను. రకరకాల గృహోపకరణ, అలంకరణ వస్తువులు తయారు చేయడమంటే నాకు చాలా ఇష్టం. అపిట్కో సంస్థ ద్వారా రెండు నెలలు శిక్షణ పొందాను. వెదురు, నూలు దారం, వివిధ రకాల వృథా వస్తువులు, తాటాకులతో గృహాలంకరణ, పూల బొకేలు, గోడలకు తగిలించుకునే వస్తువులను తయారు చేస్తున్నాను. స్వయం ఉపాధి పొందుదామని యోచిస్తున్నాను. 


వెదురుతో పూల బొకేలు

-కొవ్వాసి వెంకటలక్ష్మి

నేను ఐదో తరగతి చదివాను. నా భర్త రాజారావు కౌలు వ్యవసాయం చేస్తున్నారు. కుమార్తె కల్పన గ్రామ వాలంటీరుగా పని చేస్తోంది. కుమారుడు అరుణ్‌ కుమార్‌ డిగ్రీ పూర్తి చేసి యోగా ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నాడు. నాకు వెదురు, తాటాకు, కాగితపు అట్టలతో పూల బొకేలు, గృహోపకరణాలు చేయడమంటే ఇష్టం. రెండు నెలలు శిక్షణ పొందాను. వెదురుతో పూల బొకేలు తయారు చేసి రంగులు అద్దుతున్నాను.


శిక్షణతో మరిన్ని మెలకువలు

- కొవ్వాసి సుధారాణి

నేను ఎంఎల్టీ చదివాను. డ్వాక్రా సంఘంలో పని చేస్తున్నాను. నా భర్త ప్రసాద్‌ కూలి పనులు చేస్తున్నారు. మా ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. వెదురు, తాటాకులతో పూలబొకేలు, గృహోపకరణ, అలంకరణ వస్తువులు తయారు చేయడంలో శిక్షణ పొందాను. చాలా మెలకువలు తెలుసుకున్నాను. స్వయం ఉపాధి సాధనకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.


యూనిట్‌ ఏర్పాటు చేస్తా

-కె.తిరుపతమ్మ

నేను ఆరో తరగతి చదివాను. వ్యవసాయ కూలి పనులు చేస్తున్నాను. నా భర్త ఆరోగ్యం బాగోక ఇంటి దగ్గరే ఉంటున్నారు. వెదురు, తాటాకుతో పూల బొకేల తయారీలో శిక్షణ పొందాను. మా గ్రామంలో శిక్షణ తీసుకున్న వారిలో ఒక బృందంగా కలిసి తయారీ యూనిట్‌ పెడదామనుకుంటున్నాం.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని