logo

ఫిర్యాదు చేస్తే అరెస్టులా?

జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకోవడంతో పార్టీ నాయకులు, జన సైనికులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టారు.

Published : 02 Jun 2023 04:13 IST

పోలీసుల తీరుపై జనసేన నేతల నిరసన
భీమవరంలో ఫ్లెక్సీల రగడ

మాట్లాడుతున్న గోవిందరావు, పక్కన అప్పలనాయుడు,  శ్రీనివాస్‌ తదితరులు

భీమవరం పట్టణ, పోడూరు, న్యూస్‌టుడే: జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకోవడంతో పార్టీ నాయకులు, జన సైనికులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టారు. భీమవరంలోని గోవిందరావు నివాసôలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోడూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు.

మోహరించిన పోలీసులు

భీమవరం ఒకటో పట్టణంలోని భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్న గోవిందరావు నివాస ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున పోలీసు బలగాలు మోహరించాయి.   కొద్ది నిమిషాల్లోనే సీఐలు బి.కృష్ణకుమార్‌, జి.దాసు, నాగప్రసాద్‌, ఎస్సైలు ఎం.వెంకటేశ్వరరావు, వి.రాంబాబు, పి.అప్పారావు, పోలీసులు చేరుకున్నారు.  ఎందుకు వచ్చారు, అరెస్టు ఏమిటి అంటూ గోవిందరావు ప్రశ్నించినప్పటికీ ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6.30 గంటల ప్రాంతంలో పోలీసు వాహనంలోకి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.  అడ్డుకుంటున్న వారిని పోలీసులు పక్కకు నెట్టి వాహనాన్ని వీరవాసరం మీదుగా పాలకొల్లు నుంచి పోడూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

వాహనాన్ని వెంబడిస్తూ..

గోవిందరావును తీసుకెళ్తున్న వాహనాన్ని జన సైనికులు ద్విచక్రవాహనాలపై వెంబడించారు. తొలుత కొవ్వూరు స్టేషన్‌కు తీసుకెళ్లాలనే సంకేతాలున్నప్పటికీ పోడూరుకు చేర్చారు. అక్కడకు వందలాదిగా అభిమానులు చేరుకున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, శాంతియుతంగా ఉండాలని కార్యకర్తలకు గోవిందరావు  సూచించారు. ‘అల్లర్లు చేస్తే అధికార వైకాపా వారికి మనకు తేడా ఉండదని’ కార్యకర్తలను శాంతపరిచారు.  అనంతరం 10.45 గంటలకు గోవిందరావును స్టేషన్‌ నుంచి పంపించారు. పార్టీ నాయకులు ఆయనను ఊరేగింపుగా భీమవరానికి తీసుకొచ్చారు. దారిపొడవునా అభిమానులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. జనసేన నేత బండి రమేష్‌కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు స్టేషన్లకు తిప్పిన అనంతరం విడుదల చేశారు.

ధర్నాలు, రాస్తారోకోలు

జనసేన పార్టీ అధిష్ఠానం పిలుపు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. భీమవరం, ఉండి, తణుకు, నరసాపురం తదితర చోట్ల జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ పీఏసీ నాయకుడు వేగేశ్న కనకరాజు సూరి, చెనమల్ల చంద్రశేఖర్‌, జుత్తిగ నాగరాజు, మోకా శ్రీను, సుంకర రవి, కత్తుల నీలేంద్ర, తాతాపూడి రాంబాబు, గుల్లిపల్లి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కైకలూరులో వివాదం

కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరులో ఫ్లెక్సీ వివాదం రచ్చకెక్కింది.  వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు దీటుగా జనసేన నాయకుడు బీవీ రావు ‘రాక్షస పాలనకు అంతం..ప్రజా పాలనకు ఆరంభం’ పేరుతో కొన్నిచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కైకలూరు తాలూకా కూడలిలో బ్యానర్‌ కడుతున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ ఫ్లెక్సీలు తొలగిస్తే వైకాపా వారివి కూడా తీసివేయాలని జనసైనికులు ప్రతిఘటించారు. కొద్దిసేపటికి పోలీసులు బీవీ రావును  కైకలూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి రెండు గంటల తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం ఇక్కడి జనసేన కార్యాలయంలో బీవీ రావు విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఏ.రఘు తెలిపారు.

‘ఒక ఫ్లెక్సీ మీరు పెడితే.. మేం పది పెడతాం’

వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని కలెక్టర్‌కు, అధికారులకు ఫిర్యాదు చేసినందుకు అరెస్టు చేసినట్టుగా ఉందంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడూరు పోలీస్‌స్టేషన్‌ నుంచి భీమవరం చేరుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఇది పెత్తందారుల దౌర్జన్యం కాదా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకుల ఇసుక దందాలు, దాడుల విషయం ప్రజలకు తెలుసన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేయడంతో జిల్లా అంతటా ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు భయపడి వెనక్కి పంపించారన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్‌, రెడ్డి అప్పలనాయుడు, బొమ్మిడి నాయకర్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరంలో జాతీయరహదారిపై నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని