logo

నచ్చిన వారికే పనులు

ఏలూరు నగరపాలిక అక్రమాలకు నిలయంగా మారింది. కార్పొరేషన్‌ కాంట్రాక్టుల్లో భారీగా   అవకతవకలు జరుగుతున్నాయి. ఎక్కడైనా టెండరు ప్రక్రియ అయ్యాక పనులు చేస్తారు. ఇక్కడ మాత్రం పనులు చేశాక టెండర్లు పిలుస్తారు. అధికారులకు, నాయకులకు ముడుపులిచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు.

Updated : 08 Jun 2023 06:41 IST

కొత్తవారు టెండర్లు వేసినా రద్దు
నామినేషన్‌ విధానంలో అప్పగింతలు
ఏలూరు నగరపాలికలో మరో చోద్యం

ఏలూరులోకి కర్రల వంతెన సమీపంలో కృష్ణా కెనాల్‌గట్టుపై చేపడుతున్న నిర్మాణమిది. ఇలా గోడ కట్టిన తర్వాత మట్టి నింపి మొక్కలు పెట్టి సుందరీకరణ చేయాలి. ఇక్కడ పని మొదలై రెండు వారాలవుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే దీనికి ఇంకా టెండరు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా గుత్తేదారుకి వర్క్‌ఆర్డర్‌ ఇవ్వలేదు. కాంట్రాక్టు ఒప్పందం కూడా చేసుకోలేదు. అసలు అతను ఎంత మొత్తానికి టెండర్‌ వేశారో కూడా స్పష్టత లేదు. ఈ గుత్తేదారు ఇంజినీరింగ్‌ విభాగంలో ఓ అధికారికి అత్యంత  సన్నిహితుడు కావటంతో నిబంధనలు పట్టించుకోవడం లేదు.

ఈనాడు, ఏలూరు;- ఏలూరు నగరపాలిక అక్రమాలకు నిలయంగా మారింది. కార్పొరేషన్‌ కాంట్రాక్టుల్లో భారీగా   అవకతవకలు జరుగుతున్నాయి. ఎక్కడైనా టెండరు ప్రక్రియ అయ్యాక పనులు చేస్తారు. ఇక్కడ మాత్రం పనులు చేశాక టెండర్లు పిలుస్తారు. అధికారులకు, నాయకులకు ముడుపులిచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు. నామినేషన్‌ విధానంలో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు.
నాయకులకు ఇష్టమైన వారికి కట్టబెట్టేందుకు నామినేషన్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇందు కోసం రూ.5 లక్షల కన్నా ఎక్కువ అంచనా వ్యయం ఉన్న ఒకే పనిని విభజిస్తున్నారు. ఉదాహరణకు నగరంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు గోడలపై పెయింటింగ్‌ వేసేందుకు రూ.8 లక్షలు అవుతుందని అంచనా వేశారు. నామినేషన్‌ పద్ధతిలో చేయటం వీలు కాదని ఆ పనిని రూ.4.72 లక్షలు, రూ.3.32 లక్షల అంచనా వ్యయంతో రెండు పనులుగా విభజించారు. నామినేషన్‌ విధానంలో ఇంజనీరింగ్‌ విభాగంలో ఓ అధికారికి బినామీగా ఉన్న ఓ గుత్తేదారుకి అప్పగించారు. పైగా నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు పెయింట్‌ వేస్తే రూ.43కి ఇవ్వాల్సి ఉండగా.. రూ.76కి ఇచ్చారు.

* పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన, కార్మికుల పనితీరును పర్యవేక్షణ కోసం నగరంలో నిఘా కెమెరాలు, మైకుల ఏర్పాటుకు రూ.40 లక్షల అంచనా వేశారు. టెండర్లు పిలవకుండానే ఓ గుత్తేదారుకి అప్పగించేశారు. వైరింగ్‌ చేసేసి ఇప్పటికే 8 చోట్ల కెమెరాలు, మైకులు కూడా పెట్టేశారు. చోద్యం ఏంటంటే ఈ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తాపీగా ఇటీవల టెండర్లు పిలిచారు. ముగ్గురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయగా... పాలనాపర కారణాలతో రద్దు చేస్తున్నాం అని వారిని తప్పించారు. ఈ గుత్తేదారు కార్పొరేషన్‌లో ఓ బడాబాబుకు అత్యంత ఆప్తుడు కావడంతో అప్పనంగా అప్పగించారు.

టెండర్ల ప్రక్రియ లేకుండానే ఏర్పాటు చేసిన నిఘా కెమెరా, మైకు

చేశాక టెండర్లు

రూ.5 లక్షల వ్యయానికి మించిన ఏ పనికైనా ఆన్‌లైన్‌లో టెండర్లు పిలవాలి. తక్కువ మొత్తానికి చేస్తానని ముందుకు వచ్చినవారికి కేటాయించి అంగీకార పత్రం రాయించుకుని..వర్క్‌ ఆర్డర్‌ ఇస్తారు. అప్పుడే పని మొదలు పెట్టాలి. కార్పొరేషన్‌లో మాత్రం అధికారులకు కావాల్సిన వారికి..నాయకులకు ముడుపులిచ్చిన వారికి అసలు టెండర్లే పిలవ కుండా పనులు అప్పగిస్తున్నారు. పనులు మొదలు పెట్టాక అదే పనికి ఆన్‌లైన్‌లో నామమాత్రంగా టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా టెండర్లు వేస్తే పాలనాపర కారణాలతో రద్దు చేస్తున్నట్లు సందేశం పంపించి ముందు ఇచ్చిన వారికే కట్టబెడుతున్నారు. అన్ని పనులు సక్రమంగా చేసినా మా కాంట్రాక్టు ఎందుకు రద్దు చేశారు అని గుత్తేదారులు ప్రశ్నించినా సమాధానం చెప్పే నాథుడు లేరు.

వాటాలేసుకుంటున్నారు

కాంట్రాక్టులు కట్టబెట్టే వ్యవహారంలో ఇంజినీరింగ్‌ విభాగంలో సిబ్బంది..అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ బడాబాబుతో పాటు కొందరు కార్పొరేటర్లు చక్రం తిప్పుతున్నారు. వాళ్లు చెప్పిన వారికే ఇవ్వాలి. లేదంటే టెండర్లు పిలిచినా రద్దు చేసేస్తున్నారు. ఇటీవల ఓ డివిజన్‌లో రహదారి నిర్మాణానికి 3 పనులకు ముగ్గురు టెండర్లు దాఖలు చేయగా..చూడకుండానే రద్దు చేసేశారు. గుత్తేదారులు ఆరా తీయగా స్థానిక కార్పొరేటర్‌ తన బంధువులకు కట్టబెట్టేందుకు రద్దు చేశారని తెలిసింది. నామినేషన్‌ విధానంలో వారికి అప్పగించారు. ఈ విషయంపై కమిషనర్‌ వెంకట కృష్ణను వివరణ కోరగా ‘కాంట్రాక్టులన్నీ పారదర్శకంగా చేస్తున్నాం...కొన్ని వెంటనే చేయాల్సి రావటంతో నామినేషన్‌ పద్ధతిలో అనుమతిస్తున్నా. కాంట్రాక్టుల విషయంలో రాజకీయ ప్రమేయం లేదు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని