logo

సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు,

Published : 19 Apr 2024 04:16 IST

ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘ నాయకుల మండిపాటు

మాట్లాడుతున్న  రాజేంద్రప్రసాద్‌

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధి గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు పలువురు గురువారం రాజమహేంద్రవవరంలోని రివర్‌బే హోటల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, సుమారు రూ.36 వేల కోట్ల నిధులను ఇతర పథకాలను మళ్లించిందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, 14, 15 ఆర్థిక సంఘం, జలజీవన్‌ మిషన్‌ నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సమకూరక ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఈ విషయాన్ని చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ప్రజాప్రతినిధులు సైతం స్థానిక సంస్థలపై నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు నాగాబత్తుల శాంతకుమారి, సుబ్బారావు మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ చట్టం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, స్థానిక పంచాయతీలకు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులకు దామాషా పద్ధతితో నిధులు విడుదలలో జాప్యం చేస్తూ వచ్చిందని విమర్శించారు. 16 డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నామని, వాటిని నెరవేరుస్తామని మేనిఫెస్టోలో ప్రకటించే పార్టీకే తమ సంఘం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, జనసేన నాయకుడు ఉప్పులూరు బాబ్జి, భాజపా నాయకులు పరిమి రాధ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం నాయకురాలు శాంతకుమారి, పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని