logo

ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం

ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్‌లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

Published : 05 May 2024 05:52 IST

ఐక్యవేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

ఐక్యత చాటుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్‌లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని వేతన జీవుల సమస్యలపై చర్చించడమే కాకుండా వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అవలంబించాలనే అంశాలను ప్రస్తావించారు. నేతలు ఏమన్నారంటే.


ఐక్యతతోనే సమస్యల పరిష్కారం..
- కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఉద్యోగులు ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి. కొంతమంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం కాకుండా వారి స్వప్రయోజనాలకు సంఘాలను వాడుకుంటున్నారు. లెక్కకు మిక్కిలిగా సంఘాలు పుట్టుకొస్తుండటాన్ని ప్రభుత్వాలు అవకాశంగా తీసుకుని వారి మధ్య విభజించు- పాలించు అనే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంఘాలనేవి ఉద్యోగుల సంక్షేమానికి పని చేసేవిగా ఉన్నప్పుడే తగిన గుర్తింపు లభిస్తుంది.


ఆర్టీసీని విలీనం చేయాలని అడగలేదు..
- సీహెచ్‌ సుందరయ్య, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులెవరూ అడగలేదు. గతంలో పదేళ్ల సర్వీసు ఉంటే చాలు పింఛను వర్తించేది. ఆ తర్వాత సంస్కరణల పేరుతో పింఛను సదుపాయాన్ని తొలగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయక ముందు ప్రజలకు సమర్థంగా రవాణా సదుపాయం కల్పించేవారు. విలీనం తర్వాత బస్సుల సంఖ్యతో పాటు రూట్ల సంఖ్య తగ్గింది.


బకాయిలు చెల్లించాలి..
- బి.రవీంద్రరాజు, ఏపీ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు

ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. కొన్ని సంఘాల నాయకులు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండటంతో ఉద్యోగులు నష్టపోతున్నారు. అలాంటి విధానాల్ని  సంఘాల నాయకులు మానుకోవాలి. ఉద్యోగులందరికీ ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని