logo

‘డీడీ అచ్చెన్న మృతిపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలి’

కడప పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టరు డాక్టరు అచ్చెన్న మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండు చేశారు.  కడప ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 28 Mar 2023 03:18 IST

మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, పక్కన సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, తదితరులు

కడప నేర వార్తలు, న్యూస్‌టుడే: కడప పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టరు డాక్టరు అచ్చెన్న మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండు చేశారు.  కడప ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ అచ్చెన్న కనిపించడం లేదని ఈ నెల 14న కుటుంబసభ్యుల మేరకు కేసు నమోదైన అనంతరం అనుమానితులను విచారణ చేశారా?. వారి రాకపోకలపై నిఘా ఉంచారా?. ఎఫ్‌ఆర్‌ఐలో పేర్లు నమోదైన వారి చరవాణులను స్వాధీనపరచుకున్నారా?. అనుమానితులను పిలిచి మాట్లాడారా?’ అని ఆయన ప్రశ్నించారు. గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డు వద్ద డీడీ అచ్చెన్న మృతదేహం దొరక్కపోయినట్లయితే ఇప్పటికీ పోలీసులు ఏం చేసేవారు కాదని విమర్శించారు. 10 రోజుల పాటు అచ్చెన్న విషయంలో పోలీసులు ఏం చేశారు’ అని నిలదీశారు. ఈ నెల 14న కేసు నమోదైన అనంతరం 15న మృతుని కుమారుడు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఎస్పీ సైతం కేసులో ఏం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలోనే దళిత ఉన్నతాధికారుల ప్రాణాలకు విలువ లేకుంటే సామాన్యులను ఏం కాపాడతారు’ అని ప్రశ్నించారు. ‘అచ్చెన్న అపహరణకు గురైనప్పటి నుంచి మృతదేహం దొరికేవరకు పోలీసులు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండు చేశారు. ‘మృతదేహం దొరక్కపోతే మరో ఏడాదైన కేసు కొలిక్కివచ్చేది కాదు. దళితుల ప్రాణాలకు రాష్ట్రంలో విలువ లేదు. సుభాష్‌చంద్రతోపాటు నలుగురు పేర్లు ఉన్నాయి. ఆ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారి పేరు కూడా ఉంది. అచ్చెన్న లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి సొంత జిల్లాలో దళిత ఉన్నతాధికారి అదృశ్యమైన కేసును పోలీసులే నిర్వీర్యం చేశారు. కిడ్నాప్‌ అయిన రోజే పోలీసులు స్పందించి ఉంటే అచ్చెన్న ప్రాణాలతో ఉండేవారు. కుటుంబసభ్యుల ప్రమేయం లేకుండా శవపరీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి స్పందించకుంటే పోరాటాలు చేయాల్సి వస్తుంది’ అని మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. తొలుత ఆయన అన్న మయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజును కలిసిన అనంతరం డీడీ అచ్చెన్న మృతదేహం లభించిన గువ్వల చెరువుఘాట్‌లో ఘటనాస్థలాన్ని నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయనవెంట సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, పలువురు నాయకులు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని