logo

ముడిపట్టు రాయితీకి మంగళం!

వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు.

Published : 28 Mar 2024 03:57 IST

అయిదేళ్లలో ఒక్కరికిస్తే ఒట్టు
చేనేతలకు తీవ్ర అన్యాయం

వేలాది చేనేత కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. బడుగు జీవుల వెతలు, కన్నీటి ఘోషను పాలకులు ఆలకించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ముడి పట్టు రాయితీకి వైకాపా ప్రభుత్వం మంగళం పాడేసింది. అయిదేళ్లలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. పోగుబంధం తెగిపోతున్నా చలనం లేదు. కాలక్రమేణా ఆదరణ కరవై చతికిలపడుతున్నా భరోసా ఇవ్వడంలేదు. 

న్యూస్‌టుడే, కడప

ఉమ్మడి కడప జిల్లాలో 32 మండలాల్లో చేనేత కుటుంబాలు ఉన్నాయి. పూర్వం నుంచి వారసత్వంగా వస్తున్న వృత్తిని నమ్ముకుని 55 వేల మందికిపైగా ఆధారపడి జీవిస్తున్నారు. చేతి మగ్గాలు 33 వేలకుపైగా పనిచేస్తున్నాయి. విపణిలో ముడి పట్టు ధరలు కొండెక్కి పెనుభారం కావడంతో చాలామంది నేత పనికి దూరమవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తెదేపా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆర్థికంగా తోడ్పాటునందించాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి నాలుగు కిలోల పట్టు (స్కిల్‌)కు రాయితీపై ఇవ్వాలని 2012, సెప్టెంబరులో అనుమతిచ్చారు. తొలుత కిలోకు రూ.150 చొప్పున రూ.600 ఇచ్చారు. ఈ సొమ్ములు చాలడం లేదని కార్మికుల నుంచి విన్నపాలు రావడంతో గత తెదేపా ప్రభుత్వం కిలోకు రూ.250 చొప్పున నెలకు రూ.వెయ్యి ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు 2016, అక్టోబరు 13న ఉత్తర్వులివ్వడంతో కార్మికులకు ఊరట లభించేది. రాయితీ సొమ్మును పెంచాలని గత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికలకు ముందు 2019, ఫిబ్రవరి 5న రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ బడ్జెట్‌లో కిలోకు రూ.500 వంతున నాలుగు కిలోలకు నెలకు రూ.2 వేలు వంతున ఇస్తామని ప్రకటించారు. కార్మికుల కష్టాలను కళ్లరా చూసినా అప్పటి పాలకులు 2019, ఫిబ్రవరి 22న ఉత్తర్వులు జారీ చేశారు. ముడి పట్టు ధరలు నింగిని తాకడంతో తెదేపా పాలకులు హామీ ఇవ్వడంతో కార్మికులు ఊరట చెందారు. ఉమ్మడి కడప జిల్లా పరిధిలో 2014-2019 ఆర్థిక సంవత్సరం వరకు అయిదేళ్ల కాలంలో రూ.25.56 కోట్లు వెచ్చించారు. పథకం ద్వారా 6,500 మందికి పైగా కార్మికులు లబ్ధి పొందారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. ముడి పట్టుపై ఇస్తున్న రాయితీ పథకాన్ని పక్కనపెట్టేసింది. ప్రస్తుతం సిల్క్‌ కిలో రూ.5,500 నుంచి రూ.5,800 వరకు పలుకుతుండగా, రానురాను ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పైగా జీఎస్‌టీ అయిదు శాతం వేయడంతో మరికొంత భారం పడుతోంది. ఇంటిల్లిపాది శ్రమించి వస్త్రాలు ఉత్పత్తి చేసినా మార్కెట్లో గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు. మునుపటిలా కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం ద్వారా మార్కెటింగ్‌ వసతి కల్పించలేదు. గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాస్టర్‌ వీవర్లు కూడా కూలి ధరలను బాగా తగ్గించారు. వైకాపా ప్రభుత్వం వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని ప్రవేశ పెట్టినా అధికార పార్టీ నాయకులు సిఫార్సు చేసినవారికే ఎక్కువగా లబ్ధి కల్పించారు. మగ్గం లేకపోయినా, చేనేత పని చేయకపోయినా మంజూరు చేశారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా విచారణ చేపట్ట కుండా పక్కన పెట్టేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని