logo

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామరాజు తెలిపారు.

Published : 18 Apr 2024 03:52 IST

ఈనాడు, కడప: ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామరాజు తెలిపారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కడపలోని కలెక్టరు కార్యాలయంలో ఎస్పీ సిద్దార్థ కౌశల్‌తో కలిసి బుధవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు కలెక్టర్‌ కార్యాలయంలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్‌వో కార్యాలయం వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. మిగిలిన వారిని, వాహనాలను 100 మీటర్ల అవతల నిలిపివేస్తామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే నామినేషన్‌ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ను గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని, నామినేషన్లను ఈనెల 25 వరకు స్వీకరిస్తామని, 26న పరిశీలన, 29న ఉపసంహకరణకు చివరి తేదీ కాగా అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని వివరించారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పునరుద్ఘాటించారు.  ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ మాట్లాడుతూ జిల్లా సరిహద్దులోని అన్ని చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయి భద్రత, వెబ్‌కాస్టింగ్‌, అదనపు బలగాలు, అవసరమైన పక్షంలో ప్రత్యేక బలగాలను పంపుతామని తెలిపారు. అభ్యర్థులు అన్ని  నిబంధనలు పాటించాలని సూచించారు.

రాజకీయ పార్టీలన్నీ నిబంధనలు పాటించాల్సిందే

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని కలెక్టర్‌ విజయరామరాజు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ  వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఓటరు స్లిప్పులు పంపిణీ పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.  డీఆర్వో గంగాధర్‌గౌడ్‌,  ఆయా పార్టీల నాయకులు హరిప్రసాద్‌, భరత్‌రెడ్డి, మనోహర్‌,  కానుకదానం,  లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని