logo

జగన్‌ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!

వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు.

Updated : 19 Apr 2024 05:13 IST

గంటలకొద్దీ ప్రయాణికుల నిరీక్షణ
ఆటోలు, ప్రైవేటు వాహనాలే దిక్కు

వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. పల్లెల నుంచి ఆటోల్లో ప్రమాదకర ప్రయాణం సాగించాల్సి వస్తోంది. బస్టాండ్లలో అద్దె బస్సుల హవా పెరిగింది. గతంలో ఉన్న నైట్‌హాల్ట్‌ బస్సులు మాయమయ్యాయి. రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను తరలించేందుకు గ్రామీణ ప్రాంత సర్వీసులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయం లేక ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్తూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడిన వారెందరో? క్షతగాత్రుల సంఖ్యకు లెక్కలేదు. ఈ పాపం ఖాతా అంతా వైకాపా ప్రభుత్వానిదే. ఇక జగన్‌ సభలు జరుగుతున్నాయంటే ప్రయాణికులకు ప్రత్యక్ష నరకమే. జిల్లాలో పల్లెవాసుల ఇక్కట్లను మీరే చూడండి.







పాఠశాలకు వెళ్లాలంటే నడవాల్సిందే

మా గ్రామం నుంచి సుమారు 20 మంది విద్యార్థులు నిత్యం పొట్టిపాడులోని జడ్పీ పాఠశాలకు 7 కి.మీ నడుచుకుంటూ వెళుతున్నారు. గతంలో తాడిపత్రి నుంచి తాళ్లప్రొద్దుటూరు, రేగడిపల్లె, వెంకటాపురం, బురుజుపల్లె, బెడుదూరు మీదుగా యనమలచింతలకు బస్సు సర్వీసు ఉండేంది. పల్లెలకు బస్సు సర్వీస్‌లు రద్దు చేయడంతో విద్యార్థులు, కూలీలు, గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు.

నారాయణస్వామి, యనమలచింతల

పట్టించుకోని పాలకులు

గతంలో కమలాపురం మీదుగా గంగవరం, విభరాపురం, మొలకోనిపల్లె వరకు ఆర్టీసీ బస్సులు నడిపేవారు. దీంతో ప్రజలు బస్సుల్లో వచ్చి పనులు చూసుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకునేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బస్సులు రద్దు చేయడంతో ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. బస్సులు నడపాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు.

నరసింహులు, గంగవరం

అధిక ఛార్జీలు భరిస్తున్నాం

గతంతో ప్రతి పనికీ ఆర్టీపీపీ నుంచి బసెక్కి ప్రొద్దుటూరుకు వెళ్లేవాళ్లం. చాలారోజులుగా బస్సులు సేవలు నిలిచిపోవడంతో రానుపోను రూ.100 వెచ్చింది ఆటోలో రాకపోకలు సాగిస్తున్నాం. ఆటోలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉంది. అధికారులు స్పందించి బస్సు సర్వీసులు నడపాలి.

కుడుముల వీరమ్మ, ఆర్టీపీపీ, ఎర్రగుంట్ల మండలం

ప్రయాణానికి పాట్లు

మా ఊర్లో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకొని వాటి ద్వారా వస్తున్న ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. అయిదేళ్ల కిందట మా గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సు తిరిగేది. నష్టాలు వస్తున్నాయని ఆపేయడంతో ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. రహదారి మాత్రం వాహనాలు తిరగడానికి అనువుగా ఉంది. అయినా పల్లె బస్సు మా ఊరి వైపు రావడం లేదు. జడ్పీ ఉన్నత పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఆట్లో వెళ్లుతున్నారు. సమయానికి రాకపోవడంతో నిరీక్షణ చేయాల్సి వస్తోంది.

లంకా ఈశ్వర్‌రెడ్డి, కోనరాజుపల్ల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని