icon icon icon
icon icon icon

వైఎస్‌ను తిట్టిన బొత్స.. జగన్‌కు తండ్రి సమానులట

‘వైఎస్‌ రాజశేఖరరెడ్డిని అసెంబ్లీ వేదికగా తిట్టిపోసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. అలాంటి వ్యక్తిని తండ్రి సమానుడిగా సీఎం చెప్పారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పుబట్టారు.

Published : 25 Apr 2024 06:37 IST

హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సీఎంకే సాధ్యం
ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయరు?
రాష్ట్రానికి కంటెయినర్లలో వేల కిలోల డ్రగ్స్‌ వస్తున్నాయి
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు

ఈనాడు - బాపట్ల, ఈనాడు డిజిటల్‌ - అమరావతి, మచిలీపట్నం: ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డిని అసెంబ్లీ వేదికగా తిట్టిపోసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. అలాంటి వ్యక్తిని తండ్రి సమానుడిగా సీఎం చెప్పారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పుబట్టారు. బుధవారం ఆమె బాపట్ల జిల్లా రేపల్లె, అనంతరం కృష్ణా జిల్లా పామర్రు, పెడనలలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. రేపల్లె సభలో మాట్లాడుతూ, ‘ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టారు. అదీ ఆన్‌ రికార్డు. ఇలాంటివాళ్లు తండ్రి సమానులు ఎలా అవుతారు? రాజశేఖరరెడ్డినే కాదు, విజయమ్మనూ అవమానపరిచారు. జగన్‌కు ఉరిశిక్ష వేయాలన్నారు. ఇలా ఎన్ని మాటలన్నారో... ఆయనే తండ్రి సమానులట. పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కూడా వైఎస్‌ను తిట్టినవాళ్లే. వాళ్లనే జగన్‌ పక్కన పెట్టుకున్నారు’ అని షర్మిల విమర్శించారు. జగన్‌ మంత్రివర్గంలో ఉన్నవాళ్లంతా వైఎస్సార్‌ను తిట్టినవాళ్లేనని, వారికే పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. ‘నిజంగా ఆయన కోసం పాదయాత్రలు చేసిన షర్మిల, మిగతావాళ్లు ఏమీ కారు. ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేటుకు బలైనవాళ్లూ ఏమీ కారు. అసలు వైకాపాలో వైఎస్‌ఆర్‌ ఉన్నారా? లేరు. పార్టీలో వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్‌ అంటే సాయిరెడ్డి, ఆర్‌ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి’ అని వ్యాఖ్యానించారు.

రైతులను పట్టించుకోవట్లేదు

‘సొంత బాబాయ్‌ని చంపించిన వారికే పార్టీ టికెట్లు ఇవ్వడం.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం జగన్‌కే సాధ్యం. రైతులను రాజశేఖరరెడ్డి గుండెల్లో పెట్టుకున్నారు. కానీ జగన్‌ వారిని పట్టించుకోవడం లేదు. పంట నష్టపోతే ఒక్క ఏడాదైనా సక్రమంగా పరిహారం ఇచ్చారా?’ అని షర్మిల ప్రశ్నించారు. పామర్రు, పెడన సభల్లో మాట్లాడుతూ, ‘ప్రతి ఏటా సంక్రాంతికి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తానని చెప్పిన జగన్‌ ఎందుకు మాట నిలబెట్టుకోలేదు? ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఆరునెలల్లో భర్తీచేస్తానని మాట ఇచ్చి మడమ తిప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖాళీలు భర్తీచేయాలని డిమాండ్‌ చేసిన జగన్‌.. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు?’ అని నిలదీశారు.

  • ‘కృష్ణానది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేసే, కబ్జాలు చేసే వ్యక్తికి వైకాపా మళ్లీ పామర్రు నుంచి టికెట్‌ ఇచ్చింది. ఈ ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ విచారణ నిర్వహించి చర్య తీసుకోలేదు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన పెడన ఎమ్మెల్యే ఇసుక మాఫియా తప్ప ప్రజలకు ఏం చేశారు? రాష్ట్రానికి వేల కేజీల కొద్దీ కంటెయిర్లలో డ్రగ్స్‌ వస్తున్నాయి. జగన్‌కు, భాజపాకు అక్రమంగా పొత్తు ఉంది. తమ పార్టీ ఎంపీలు ఎన్డీయేకే మద్దతు ఇస్తామని బహిరంగంగానే అంబటి రాంబాబు ఎందుకు చెబుతున్నారు?’ అని షర్మిల విమర్శించారు.
  • ‘రాజశేఖరరెడ్డి ఆఖరి క్షణం వరకు ప్రజల కోసమే తపించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజాదర్బార్‌ పేరుతో నిత్యం వేల మందిని కలిసేవారు. జగన్‌ ఇంతవరకు ఒక్కరినైనా కలిశారా? ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు సిద్ధం అంటూ బయటకు వచ్చారు. దేనికి సిద్ధం.. రూ.8లక్షల కోట్ల అప్పు చేసేందుకా?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img