icon icon icon
icon icon icon

మాజీ వాలంటీర్లకు వైకాపా డబ్బు సంచులు!

పోలింగ్‌ సమీపిస్తున్నవేళ.. రాజీనామాలు చేసిన వాలంటీర్ల చేత ఓటర్లకు డబ్బు పంచేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారు.

Published : 04 May 2024 08:50 IST

ఓటర్లకు పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు
ఐ-ప్యాక్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ 

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ సమీపిస్తున్నవేళ.. రాజీనామాలు చేసిన వాలంటీర్ల చేత ఓటర్లకు డబ్బు పంచేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారు. ఇందుకోసం మాజీ వాలంటీర్లతో ఐప్యాక్‌ ప్రతినిధులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి? అందుకోసం అనుసరించాల్సిన విధానం, డబ్బు పంపిణీ తదితర అంశాలపై వాలంటీర్లకు ఐప్యాక్‌ ప్రతినిధులు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 89,798 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు రాజీనామా చేశారు. శుక్రవారం ఒక్కరోజే 2,265 మంది బయటకొచ్చారు. వాలంటీర్లుగా ఉంటూ వైకాపాకు మద్దతుగా ప్రచారం చేయడం ఇబ్బందికరంగా మారడంతో వారి చేత నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు.

పని చేసిన చోట్లనే..

గ్రామాల్లో 50 ఇళ్లకు, పట్టణాల్లో 100 ఇళ్లకు ఒకరు చొప్పున విధులు నిర్వర్తించిన వాలంటీర్లు... రాజీనామాలు సమర్పించి, అదే చోట్ల తిరిగి వైకాపా కోసం పని చేయనున్నారు. వారి పరిధిలోని కుటుంబాలకు వాలంటీర్లు బాగా పరిచయం ఉన్నందున.. పార్టీ కోసం వారిని వినియోగించుకుని లబ్ధి పొందాలని వైకాపా నేతలు అడ్డగోలు ప్రణాళికలు సిద్ధం చేశారు. వైకాపా మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారం చేసే ముసుగులో మాజీ వాలంటీర్లతో ఓటర్లకు నగదు పంపిణీ చేయించనున్నారు. ఐ ప్యాక్‌ ప్రతినిధులు వీరితో నిర్వహిస్తున్న సమావేశాల్లో ప్రధానంగా ఇదే విషయంపై సూచనలు చేస్తున్నారు. డబ్బు పంపిణీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలిస్తున్నారు. 

మాజీలతో ప్రమాణాలు

ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో ఎలాంటి   పొరపాట్లూ చోటుచేసుకోకుండా అందరికీ అందేలా చూస్తామని వాలంటీర్ల చేత... వైకాపా నేతలు ప్రమాణాలు చేయించుకుంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో రెండు, మూడు రోజులుగా మాజీ వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ... ప్రమాణాలు చేయిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ వాలంటీర్లకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రూ.20 వేలు, ఇంకొన్ని జిల్లాల్లో రూ.25 వేలు చొప్పున... వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు అందించారు. ఓటర్లకు పంపిణీ చేసే నగదులో 10% చొప్పున కమీషన్‌ ఇస్తామని నేతలు ఆశ చూపుతున్నారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్లతోనూ మంతనాలు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)లో పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లతోనూ వైకాపా నేతలు కొద్ది రోజులుగా మంతనాలు సాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూలీలతో ఉపాధి పనులు చేయించడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఒక్కొక్కరి పరిధిలో 200 నుంచి 1,000 మంది  కూలీలు పని చేస్తుంటారు. పోటీలో ఉన్న వైకాపా అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు... ఫీల్డ్‌ అసిస్టెంట్లలను పిలిపించి మాట్లాడుతున్నారు. కూలీల ఓట్లు పడేలా సహకరించాలని... ఇందుకోసం డబ్బు పంపిణీ బాధ్యతనూ తీసుకోవాలని వారిపై ఒత్తిడి పెడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు కొందరు... పని ప్రదేశాల్లో వైకాపాకు మద్దతుగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నాలుగైదు రోజులుగా వైకాపా నేతలు ఫీల్డ్‌ అసిస్టెంట్లతో మంతనాలు సాగిస్తున్నారు.

బరి తెగిస్తున్న రిసోర్స్‌ పర్సన్లు

పట్టణ ప్రాంతాల్లో స్వయం, సహాయక సంఘాలు, సభ్యుల మధ్య సమన్వయం కోసం పనిచేసే రిసోర్స్‌ పర్సన్లు అనేక చోట్ల వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తూ బరి తెగిస్తున్నారు. మొన్నటివరకు సంఘాలతో సమావేశాలు నిర్వహించిన వీరు .. కొద్ది రోజులుగా సభ్యుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులకు ఓట్లేయాలని సూచిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, కడప నగరాల్లో రిసోర్స్‌ పర్సన్లు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img