icon icon icon
icon icon icon

ఏ-1 కిట్టు.. యథావిధిగా ప్రచారం

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ఇంకా పోలీసులు వైకాపా కోడ్‌నే అనుసరిస్తున్నారు. అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు.

Published : 04 May 2024 05:58 IST

హత్యాయత్నం కేసు నమోదుచేసినా.. అరెస్టు చేయరు
తెల్లవారుజాము వరకూ బందరు స్టేషన్‌లో నాని మంతనాలు
దాడి ఘటనలో బాధితులపై ఎట్రాసిటీ కేసు నమోదు
మచిలీపట్నం అరాచక ఘటనలో పోలీసుల పక్షపాత వైఖరి

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-మచిలీపట్నం క్రైం: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. ఇంకా పోలీసులు వైకాపా కోడ్‌నే అనుసరిస్తున్నారు. అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు. మచిలీపట్నంలో గురువారం సాయంత్రం వైకాపా అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు జనసేన బీసీ నాయకుడు మహేష్‌ ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మహేష్‌ భార్య హేమలతపై కిట్టు అనుచరులు దాడి చేసి, కుటుంబసభ్యులపైనా పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పోలీసుస్టేషన్‌ వద్ద కూడా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం సెక్షన్‌ కింద కేసు పెట్టి.. ఏ1గా చేర్చినా ఇంతవరకూ అరెస్టు చేయలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసినా.. కిట్టు జోలికి వెళ్లేందుకు సాహసించలేదు. అరెస్టయిన వారు కూడా కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. మరోవైపు బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనంగా నిలిచింది.

కిట్టు ఏ1 అయినా..

జనసేన నాయకుడు మహేష్‌ భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద మచిలీపట్నం పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదుచేశారు. ఈ కేసులో పేర్ని కిట్టును ఏ1గా, ఆయన అనుచరులు.. చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్‌, శీనయ్య, ధనబాబు, లంకే రమేష్‌తో పాటు ఇతరులను నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చూపించారు. హత్యాయత్నం కేసులో ఏ-1 అయిన కిట్టు శుక్రవారం నగర పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు.

వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల

ఈ కేసులో కిట్టు మినహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి.. స్థానిక పీడీఎం కోర్టులో మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ నిర్వహించాలని పోలీసులను ఆదేశిస్తూ.. వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

స్టేషన్‌లో నాని మంతనాలు

తన కుమారుడు కిట్టుపై నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన అనుచరులతో వెళ్లిన నాని.. తెల్లవారుజామున 2 గంటల వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. హత్యాయత్నం కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి అన్ని గంటల పాటు స్టేషన్‌లో సీఐ సతీష్‌కుమార్‌తో చర్చలు జరపడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బాధితులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు

ఇటీవల వైకాపా నేతలు ప్రతిపక్షాల శ్రేణులపై దాడులు చేయడం, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించడం మామూలైపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఘటనలో దాడికి గురైన బాధితులపైనా పోలీసులు కేసు నమోదుచేశారు. కిట్టు ప్రచారం చేస్తుండగా అకారణంగా కర్రి మహేష్‌ కుటుంబసభ్యులు తమపై దాడిచేసి, కులదూషణకు పాల్పడ్డారని దాసరి నాగలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో కర్రి మహేష్‌, కుటుంబసభ్యులు, నాగబాబు, శ్రవణ్‌కుమార్‌, శ్యామ్‌, మరి కొందరిపై పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు.


విచారించి చర్యలు తీసుకుంటాం
- నయీం అస్మి, కృష్ణా ఎస్పీ

ఇరుపక్షాల ఫిర్యాదులపై కేసులు నమోదుచేశాం. కర్రి హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో ఏ-1గా ఉన్న పేర్ని కిట్టు పాత్రపై వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత చర్యలు తీసుకుంటాం. మహేష్‌ కుటుంబసభ్యులపై నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుకు సంబంధించి డీఎస్పీ విచారణ అనంతరం చర్యలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img