icon icon icon
icon icon icon

వారసత్వమే అర్హత

పోరాటాలకు పశ్చిమ బెంగాల్‌ వేదిక. ఇక్కడ క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలుగా పని చేసి నేతలుగా ఎదుగుతారని పేరు. కానీ ఆ సంప్రదాయం క్రమంగా మారిపోతోంది.

Published : 26 Apr 2024 04:43 IST

బెంగాల్‌లో కొత్త రాజకీయం
అన్ని పార్టీలదీ అదే బాట
గతానికి భిన్నంగా కొత్త నేతల రాక

పోరాటాలకు పశ్చిమ బెంగాల్‌ వేదిక. ఇక్కడ క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలుగా పని చేసి నేతలుగా ఎదుగుతారని పేరు. కానీ ఆ సంప్రదాయం క్రమంగా మారిపోతోంది. వారసత్వ రాజకీయాలకు ఆ రాష్ట్రం ఇప్పుడు పెద్ద పీట వేస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా వారసులు బరిలోకి దిగారు. రాష్ట్రంలోని 42 నియోజకవర్గాల్లో 13 చోట్ల వారసులు తలపడుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు వారసులకే పార్టీలు టికెట్లు ఇచ్చాయి.

విద్యార్థి రాజకీయాల నుంచి..

విద్యార్థి రాజకీయాలతో ప్రతిధ్వనించే పశ్చిమ బెంగాల్‌ క్రమంగా కుటుంబ రాజకీయాల దిశగా సాగుతోంది. వారసత్వ నేతలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘ఇది బెంగాల్‌ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. వర్గ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల దిశగా రాష్ట్రం సాగుతోంది. గతంలో ఎన్నడూ ఇంతమంది వారసులు ఎన్నికల్లో పోటీ చేయలేదు’ రాజకీయ అధ్యయన వేత్త మైదుల్‌ ఇస్లాం పేర్కొన్నారు. గతంలో బెంగాల్‌లో రాజకీయాలను జనాదరణ కలిగిన నేతలు నియంత్రించేవారని, పార్టీ గుర్తులు, రాష్ట్రంలోని వివిధ అంశాలు ప్రభావితం చేసేవని, అలాంటి రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

విద్యార్థి నేతలకు కాలం చెల్లిందా?

పశ్చిమ బెంగాల్‌ విద్యార్థి నేతలకు ఆలవాలం. మమతా బెనర్జీ, బుద్ధదేవ్‌ భట్టాచార్య, బిమన్‌ బోస్‌, సోమేన్‌ మిత్రా, ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ తదితరులు విద్యార్థి నేతలుగా పని చేసినవారే. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల నుంచి నేతలు రావడం లేదు. దీంతో వారసత్వ రాజకీయాలు విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రెసిడెన్సీ కళాశాల, జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో మాత్రమే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా వాటికి గత ఐదేళ్లుగా ఎన్నికల్లేవు. దీంతో నేతలు ఆవిర్భావించడం లేదు.


అన్ని పార్టీల నుంచీ..

రాష్ట్రంలో పోటీ చేస్తున్న అన్ని పార్టీలూ వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు, కాంగ్రెస్‌ నుంచి నలుగురు వారసులు బరిలో ఉన్నారు. వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేసే భాజపా, సీపీఎం ఇద్దరేసి వారసులకు టికెట్లు ఇచ్చాయి.

వారసులకు టికెట్లు ఇవ్వడంలో పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయని తృణమూల్‌, భాజపా, కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కుటుంబ సభ్యులైతే విధేయులుగానూ, విశ్వాసపాత్రులుగానూ ఉంటారని, నమ్మదగిన వారిగా నిలుస్తారని అంటున్నారు.
రాజకీయాల్లో కుటుంబ సభ్యుల విజయానికి రెండు ప్రధాన కారణాలుంటాయంటున్నారు. పేరును గుర్తించడంతోపాటు ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటంవల్ల ఎన్నికల్లో గట్టి మద్దతు లభిస్తుందని తృణమూల్‌ నేత ఒకరు తెలిపారు.


ముందు వరుసలో తృణమూల్‌

  • ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారసుడిగా రాజకీయాల్లోని వచ్చిన తృణమూల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ డైమండ్‌ హార్బర్‌ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మూడోసారి బరిలోకి దిగారు.
  • ఉలుబెరియా నుంచి సిటింగ్‌ ఎంపీ సజ్దా అహ్మద్‌ పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ ఎంపీ సుల్తాన్‌ అహ్మద్‌ సతీమణి.
  • జేనగర్‌ నుంచి ప్రతిమా మండల్‌ మరోసారి బరిలో ఉన్నారు. ఆమె మాజీ ఎంపీ గోబింద చంద్ర నస్కర్‌ కుమార్తె.
  • బర్దమాన్‌-దుర్గాపుర్‌ నుంచి మాజీ క్రికెటర్‌, ఎంపీ కీర్తి ఆజాద్‌ పోటీ చేస్తున్నారు. గతంలో భాజపా ఎంపీగా పని చేసిన ఆయన తృణమూల్‌ నుంచి బరిలోకి దిగారు. ఆయన తండ్రి బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి భగవత్‌ ఝా ఆజాద్‌.
  • డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, న్యాయవాది పిల్లలు న్యాయవాదులు అయినప్పుడు రాజకీయ నేతల వారసులు రాజకీయాల్లో పాల్గొనడం తప్పెలా అవుతుందని తృణమూల్‌ నేత శాంతనూ సేన్‌ ప్రశ్నిస్తున్నారు. అర్హతల విషయంలో రాజీ పడినప్పుడే వారసత్వ రాజకీయాల్లో ఇబ్బంది ఎదురవుతుందని, లేకుంటే ఇబ్బందేమీ ఉండదని ఆయన అంటున్నారు.

భాజపా తరఫున..

  • కాంఠీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరఫున సౌమేందు అధికారి బరిలో నిలిచారు. ఆయన తూర్పు మేదినీపుర్‌ ప్రాంతంలో శక్తిమంతమైన అధికారి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి శిశిర్‌ అధికారి ఈ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
  • బోంగావో నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న శాంతను ఠాకుర్‌.. మతువా ఠాకుర్‌బాడీ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి మంజుల్‌ కృష్ణ ఠాకుర్‌ తృణమూల్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఆయన సమీప బంధువు మమతా బాలా ఠాకుర్‌ తృణమూల్‌ ఎంపీగా పని చేశారు.

కాంగ్రెస్‌ నుంచి..

  • క్షిణ మాల్దాలో 2006 నుంచి ఎంపీగా గెలుస్తున్న అబు హసేం ఖాన్‌ చౌధురి కుమారుడు ఇషాఖాన్‌ చౌధురికి ఈ సారి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. ఘనీఖాన్‌ చౌధురి సోదరుడే అబు హసేం ఖాన్‌.
  • పురూలియా నుంచి కాంగ్రెస్‌ తరఫున నేపాల్‌ మహతో బరిలోకి దిగారు. ఆయన మాజీ ఎంపీ దేబేంద్ర మహతో కుమారుడు.
  • జాంగీపుర్‌ నుంచి మాజీ మంత్రి అబ్దుస్‌ సత్తార్‌ మనవడు మోర్తాజా హొస్సేన్‌ పోటీ చేస్తున్నారు.
  • ‘నేనూ ఎమ్మెల్యేగా గెలిచి 15 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నా’ అని రాయ్‌గంజ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అలీ ఇమ్రాన్‌ రాంజ్‌ తెలిపారు. ఆయన సీనియర్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ సీనియర్‌ నేత మహమ్మద్‌ రంజాన్‌ అలీ కుమారుడు. లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన హఫీజ్‌ ఆలం సైరానీ మేనల్లుడు.

సీపీఎం తరఫున..

దక్షిణ కోల్‌కతా సీపీఎం అభ్యర్థి సారియా షా హలీం కూడా రాజకీయ వారసురాలే. ఆమె మామ హషీం అబ్దుల్‌ హలీం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ స్పీకర్‌గా సుదీర్ఘకాలం పని చేశారు. ఆమె భర్త ఫవాద్‌ హలీం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు.

శ్రీరాంపుర్‌ సీపీఎం అభ్యర్థి దీప్సితా ధర్‌ యువ నేత. ఆమె గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మ నిధి ధర్‌ మనవరాలు.


సమర్థన

రాజకీయ వారసులను బరిలో దింపడాన్ని భాజపా, సీపీఎం సమర్థించుకుంటున్నాయి. వారికి కుటుంబాలవల్లే టికెట్లు ఇవ్వలేదని, సమర్థతను చూశామని చెబుతున్నాయి.

  • ‘సారియా షా హలీం, దీప్సిత ధర్‌లు మంచి వక్తలు. వారికి వారసత్వం అనేది అర్హత కాదు’ అని సీపీఎం నేత సుజన్‌ చక్రవర్తి స్పష్టం చేశారు.
  • ‘వారసత్వ రాజకీయాలకు మా పార్టీ  వ్యతిరేకం. శాంతను ఠాకుర్‌, సౌమేందు అధికారి సుప్రసిద్ధ రాజకీయ నేతలు’ అని భాజపా నేత సమీక్‌ భట్టాచార్య తెలిపారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img