icon icon icon
icon icon icon

గుత్తా రాజకీయ మలుపు.. కొండ నుంచే

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం స్వగ్రామం నుంచే మొదలైనా.. కీలక మలుపు తిప్పింది మాత్రం దేవరకొండ రాజకీయాలే.

Updated : 16 Nov 2023 11:44 IST

గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం స్వగ్రామం నుంచే మొదలైనా.. కీలక మలుపు తిప్పింది మాత్రం దేవరకొండ రాజకీయాలే. దేవరకొండ నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన తర్వాతే ఆయనకు రాష్ట్రస్థాయిలో డెయిరీ ఛైర్మన్‌, ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీగా అవకాశాలు రావడం సెంటిమెంట్‌గా భావిస్తారు. అందుకే ఆది నుంచి ఆయనకు దేవరకొండ అంటే అమితమైన ప్రేమ. గుత్తా సుఖేందర్‌రెడ్డి సొంత గ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల నుంచి 1981లో గ్రామపంచాయతీ సభ్యుడిగా ఎన్నికవడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం 1984-85 వరకు చిట్యాల మార్కెట్‌ కమిటీ వైస్‌ ఛైర్మన్‌గా, 1992లో సింగిల్‌ విండో ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ముఖ్య సహచరునిగా ఉంటూ నల్గొండ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి లక్ష్యంతో.. 1995 మార్చి 10న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో దేవరకొండ జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. దేవరకొండలో వాపపక్ష పార్టీల ప్రభావం ఎక్కువ. దేవరకొండకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో అప్పటి వరకు తెదేపా గెలవలేదు. అయినా జడ్పీటీసీ ఎన్నికల్లో సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డిని ఓడించి గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలనం సృష్టించారు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్‌ పదవి దక్కలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌, ఏపీడీడీసీఎఫ్‌ ఛైర్మన్‌గా 1995-99 వరకు పనిచేశారు. 1999-2004 వరకు తెదేపా తరఫున నల్గొండ ఎంపీగా పనిచేశారు. అనంతరం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరి 2009 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2019-21 వరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా.. రెండోసారి 2021 డిసెంబరులో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

దేవరకొండ, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img