icon icon icon
icon icon icon

ఏకగ్రీవ ఎమ్మెల్యే ఒక్కరే..

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో శాసన సభకు పలు పర్యాయాలు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగినప్పటికీ ఏకగ్రీవ ఎన్నిక మాత్రం ఒక్క దేవరకొండ నియోజకవర్గంలోనే జరిగింది.

Updated : 20 Nov 2023 09:08 IST

ధీరావత్‌ భారతి

మ్మడి నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో శాసన సభకు పలు పర్యాయాలు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగినప్పటికీ ఏకగ్రీవ ఎన్నిక మాత్రం ఒక్క దేవరకొండ నియోజకవర్గంలోనే జరిగింది. అదీ 2001లో మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం వద్ద నక్సల్‌ కాల్పుల్లో అప్పటి ఎమ్మెల్యే ధీరావత్‌ రాగ్యానాయక్‌ (కాంగ్రెస్‌) చనిపోవడంతో 2002 మే నెలలో ఉప ఎన్నిక జరపాల్సి వచ్చింది. నక్సల్స్‌ దాడిలో రాగ్యానాయక్‌ మరణించినందున వివిధ రాజకీయ పార్టీలు ఆ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే అభ్యర్థులను నిలపమని ప్రకటించాయి. కాంగ్రెస్‌ పార్టీ రాగ్యానాయక్‌ భార్య ధీరావత్‌ భారతిని అభ్యర్థిగా ప్రకటించింది. రామావత్‌ శంకర్‌నాయక్‌ అనే స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఆయనతో చర్చలు జరిపి ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరడంతో ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. భారతీ రాగ్యానాయక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం ఆమెకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.

నేరేడుచర్ల, న్యూస్‌టుడే


‘రావి’.. తొలుత గాంధేయవాది

రావి నారాయణరెడ్డి

తెలంగాణ సాయుధ పోరాట సారథి రావి నారాయణరెడ్డి కమ్యూనిస్టు నేతగానే గుర్తింపు పొందారు. కానీ ఆయన గాంధేయవాది. విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ పిలుపునందుకుని 1930లో కాకినాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో బద్దం ఎల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు. గాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు హరిజనోద్ధరణ కోసం తన భార్య సీతాదేవిపై ఉన్న బంగారు ఆభరణాలు విరాళం ఇచ్చారు. 1944లో 11వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. ఆపై కమ్యూనిస్టు వైపు ఆకర్షితుడై తెలంగాణ సాయుధ పోరాటానికి సారథ్యం వహించారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ, భువనగిరి శాసనసభకు పోటీ చేసి రెండు స్థానాల్లోనూ భారీ ఆధిక్యంతో ఎన్నికయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కన్నా అధిక మెజార్టీ సాధించి దేశంలోనే చరిత్ర సృష్టించారు.  
- భువనగిరి, న్యూస్‌టుడే


స్వతంత్ర అభ్యర్థులే అధికం

ఆలేరు, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాలకు మొత్తం 276 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 129 మంది రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాగా.. సగానికి పైగా అంటే 147 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి పార్టీల అభ్యర్థుల కంటేే స్వతంత్రులు పోటీలో ఉండటం రాజకీయ చైతన్యానికి సూచికగా మేధావులు అభిప్రాయ పడుతున్నారు. అత్యధికంగా మునుగోడులో 35 మంది స్వతంత్రులు బరిలో ఉండగా, అత్యల్పంగా తుంగతుర్తిలో నలుగురు ఉన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్‌లో అయిదుగురు చొప్పున, భువనగిరిలో ఆరుగురు, మిర్యాలగూడ, సూర్యాపేటలో తొమ్మిది మంది చొప్పున, ఆలేరు, నకిరేకల్‌లో 10 మంది చొప్పున ఉన్నారు. హుజూర్‌నగర్‌లో 13, నల్గొండలో 19, కోదాడలో 22 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది వారివారి నియోజకవర్గాంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చామని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img