
ఏడు మామిడిపళ్లకు నలుగురు కాపలాదారులు
ఇంటర్నెట్‌డెస్క్: అనగనగా రెండు మామిడి చెట్లు. వాటికి కాసిన ఏడు మామిడి పండ్లు. చుట్టూ ఆరు శునకాలు. నలుగురు కాపలాదార్లు. ఇవేం లెక్కలు అనుకుంటున్నారా? ఇది తెలియాలంటే మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ వెళ్లాల్సిందే.
జబల్పూర్లోని రాణి, సంకల్ప్ పరిహార్ దంపతుల కష్టాలు అన్నీ ఇన్నీకాదు. సాధారణంగా పండ్ల తోటల్లోకి ఇతరులు ప్రవేశించకుండా కంచె వేస్తుంటారు. అవసరమైతే ఒకరో, ఇద్దరో కాపలా ఉంటారు. కానీ పరిహార్ దంపతులు మాత్రం తమ తోటలోని రెండు మామిడి చెట్లకు నలుగురు వ్యక్తులను, ఆరు శునకాలను కాపలాగా ఉంచారు. ఎందుకంటే అవి మామూలు మామిడి చెట్లు కాదు. వారి పాలిట కల్పవృక్షాలు. పరిహార్ దంపతుల తోటలో ఉన్నవి జపాన్‌కి చెందిని మియాజాకి జాతికి చెందిన మామిడి చెట్లు. అంతర్జాతీయ మార్కెట్లో మియాజాకి మామిడి పళ్లు గతేడాది వీటి ధర కిలో 2.70 లక్షలు పలికాయి. ఈ విషయం తెలిసి కొంత మంది దొంగలు మామిడి పండ్లను దోచుకువెళ్లారు. దీంతో పరిహార్ దంపతులు ఈ ఏడాది నలుగురు సిబ్బందిని, ఆరు శునకాలను కాపలాగా ఉంచారు.
తానొకసారి చెన్నై వెళ్తున్న సమయంలో రైల్లోని ఒక వ్యక్తి మామిడి మొక్కలను ఇచ్చాడని, అవి మియాజాకి జాతి మామిడి పండ్లనే విషయం తెలియకుండానే సాగు చేసినట్లు పరిహార్ తెలిపారు. మామిడి పండ్లకోసం పలువురు తమని సంప్రదిస్తున్నారని అయినా వాటిని అమ్మడం లేదని చెబుతున్నారు. మియాజాకి జాతి రకపు మామడి చెట్లను మరిన్ని సాగుచేసేందుకు వాటిని ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆ మామిడి కాయలను పరిశీలించిన మధ్యప్రదేశ్ హార్టీకల్చర్ విభాగపు అధికారులు అవి అరుదైన జాతికి చెందినవి కావడంతో అధిక ధర ఉన్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.