యూపీలో కొడితే చైనాలో తగిలింది!

ఉత్తర్‌ ప్రదేశ్‌ స్థానిక ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ.. చైనా వస్తువులకు సవాలుగా మారింది.

Published : 28 Oct 2020 17:15 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ ప్రదేశ్‌ స్థానిక ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ.. చైనా వస్తువులకు సవాలుగా మారింది. దీపావళి పర్వదినం సందర్భంగా చైనా ఎప్పుడూ ఎగరేసుకుపోయే ఆదాయానికి ప్రాంతీయ ఉత్పత్తులు గండి కొడుతున్నాయి. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’, ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాల అమలులో భాగంగా  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రోత్సాహంతో ఆ రాష్ట్రంలో తయారౌతున్న వివిధ ఉత్తత్తులకు.. ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో కూడా ఆదరణ లభిస్తోంది.  
చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘వన్‌ డిస్ట్రక్ట్‌ వన్‌ ప్రోడక్ట్‌’ (ఒక జిల్లా.. ఒక వస్తువు-ఓడీఓపీ) పథకంలో భాగంగా వివిధ వస్తువులు తయారు చేస్తున్నారు. దీనిలో భాగంగా తయారౌతున్న వివిధ కళాకృతులు జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో బహుమతులుగా మెరుస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ వస్తువులు ఆన్‌లైన్‌ వేదికగా కూడా లభ్యమౌతున్నాయి. దీపావళి సందర్భంగా కొత్త ఊపును అందిపుచ్చుకున్న వీటి విక్రయాలు చైనా వస్తువుల గిరాకీపై అమిత ప్రభావం చూపుతున్నాయి.

దీపావళి సందర్భంగా ఇక్కడి కళాకారులు మట్టి, వెదురుతో తయారుచేసిన దీపాలు, కొవ్వొత్తులు, అలంకరణ వస్తువులను పత్యేకంగా తయారుచేస్తున్నారు. ఇవి పట్నా, వారణాసి, దిల్లీ తదితర నగరాలకు, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలతో సహా అమెరికా, సింగపూర్‌, నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్‌, దుబాయ్‌ తదితర దేశాలకూ ఎగుమతౌతున్నాయి. పండుగ సందర్భంగా వీటి విక్రయాలు దూసుకుపోతున్నాయి. ఇక సభ్యులు సిద్ధం చేసే బెల్లం, ఊరగాయలు, అలంకరణ వస్తువులు వంటి వాటికి సంవత్సరం పొడవునా డిమాండ్‌ ఉంటోంది. తద్వారా మహిళలకు కూడా చక్కటి ఉపాధి లభించటం పట్ల ఓడీఓపీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
దియోరియా జిల్లాలోనే 1500 మందికి పైగా ఓడీఓపీ పథకంలో భాగస్తులుగా ఉన్నారు. తమ ఎగుమతులకు ఈ దీపావళి సందర్భంగా 70 నుంచి 80 శాతం వరకు డిమాండ్‌ పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమకు ఇప్పటి వరకు రూ.2.5 కోట్ల ఆదాయం సమకూరిందని సభ్యులు తెలిపారు. గతంలో రోజుకు వంద వస్తువులు తయారుచేయడమే కష్టంగా ఉండేదని.. తమకు అందిన ప్రభుత్వ రుణాలతో ప్రస్తుతం రోజుకు 500 వందలకు పైగా తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో తయారైన వస్తువులకు పూర్తి సహకారం అందించాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని ఎంఎస్‌ఎంఈ అదనపు సెక్రటరీ నవనీత్‌ సెహ్‌గల్‌ తెలిపారు. తామందరం అదే దిశగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని