Bed Rotting: ఏమిటీ ‘బెడ్‌ రాటింగ్‌’.. ఎందుకంత ట్రెండ్‌ అవుతోంది..?

సుదీర్ఘ సమయంపాటు బెడ్‌కు అంకితమయ్యే ‘బెడ్‌ రాటింగ్‌’కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి.

Updated : 31 May 2023 08:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలసటగా అనిపించిన.. ఓపిక లేకపోయిన.. తదితర సందర్భాల్లో ఎక్కువ సేపు మంచంపైనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇది సహజంగా జరిగేదే. కానీ, ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగంలో (Generation Z) ఇదో కొత్త పేరుతో ట్రెండ్‌ అవుతోంది. అదే బెడ్‌ రాటింగ్‌ (Bed Rotting). అంటే.. సుదీర్ఘ సమయం పాటు పడకకే అంకితం అవడమన్నమాట. తాజాగా ఇదే పేరుతో వస్తోన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇంతవరకు ఎలాగున్నా.. ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడంలో (Self Care) భాగంగా ఒక దశవరకు భౌతిక, మానసిక ప్రశాంతతకు ఇదెంతో ఉత్తమ మార్గమని కొంతమంది నిపుణులు కూడా సూచిస్తుండటం గమనార్హం.

అమెరికాకు చెందిన ఓ టిక్‌టాకర్‌ తొలుత ఈ పదాన్ని ఉపయోగిస్తూ.. ‘ఇలా బెడ్‌కు అంకితం అవడం ఎవరికి ఇష్టం’ అని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో వైరల్‌గా మారడంతోపాటు ఎంతోమంది ఆమెకు మద్దతుగా కామెంట్లు పెట్టారు. ఇప్పటివరకు సుమారు కోటిన్నర మంది వీక్షించారు. మరో యువతి పెట్టిన టిక్‌టాక్‌ పోస్టును మూడు కోట్లకుపైగా చూశారు. ఇదే తరహాలో అనేక వీడియోలు ఇటీవల టిక్‌టాక్‌ వంటి వీడియో మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ (Health Care) కోసం నేటి యువత ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారట.

సుదీర్ఘ సమయంపాటు బెడ్‌మీద పడుకోవడమే ‘బెడ్‌ రాటింగ్‌’ అర్థం. సాధారణం కంటే ఎంత ఎక్కువ సేపు మంచానికే పరిమితం అవుతున్నారనేదే దీని భావం. ఎందుకు అంతసేపు ఉంటున్నారు..? ఆ సమయంలో ఏం చేస్తున్నారనేది ముఖ్యం కాదు. కొంతమంది ఓటీటీలు చూడటం, సీలింగ్‌ను చూస్తూ ఉండిపోవడం, యోగా చేయడం చేస్తుంటే.. మరికొందరు నిద్రపోవడం చేస్తున్నారు. అయితే, బెడ్‌ రాటింగ్‌ మాదిరిగానే ఇటీవల ఎన్నో చేష్టలు ట్రెండింగ్‌గా మారాయి. ‘బాడీ చెకింగ్‌’, ‘వాట్‌ ఐ ఈట్‌ ఇన్‌ ఏ డే’ వంటి పేర్లతో పలు వీడియోలు గతంలో వైరల్‌ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని