MLA Sayanna: ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు.. మారేడుపల్లిలో అంత్యక్రియలు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated : 20 Feb 2023 12:49 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయాన్ని కార్ఖానాకు తరలించారు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం క్యాంప్‌ కార్యాలయంలో పార్థివ దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం అంతిమయాత్రగా తీసుకొచ్చి మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చివరిసారిగా సాయన్న పార్థివదేహాన్ని చూసేందుకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

సాయన్న భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి ఉపసభాపతి బండా ప్రకాశ్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కూడా నివాళులర్పించారు. ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్దకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకొని అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు అధికారులు, స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. అనంతరం మారేడుపల్లి శ్మశానానికి భౌతికకాయాన్ని తరలించారు.

భౌతికదేహాన్ని అంతిమయాత్రకు తరలిస్తూ..

మృదు స్వభావి ఎమ్మెల్యే సాయన్న: కిషన్‌రెడ్డి

ఎమ్మెల్యే సాయన్న మృదు స్వభావి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అశోక్ నగర్‌లోని ఎమ్మెల్యే సాయన్న నివాసంలో ఆయన  పార్థివ దేహాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా అందరితో సాయన్న కలివిడిగా స్నేహపూర్వకంగా వ్యవహరించే వారని తెలిపారు.

ప్రజల మధ్య నిరాడంబరంగా ఉండే వ్యక్తి: మంత్రి ఇంద్రాకరణ్‌రెడ్డి

ప్రజల మధ్యనే నిరాడంబరంగా ఉండే వ్యక్తి ఎమ్మెల్యే సాయన్న పరమాపదించడం చాలా బాధాకరమని మంత్రి ఇంద్రాకరణ్‌రెడ్డి అన్నారు. కంటోన్మెంట్‌ ప్రజలకు ఎన్నో సేవలు అందించిన వ్యక్తి అనుకోకుండా మరణించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. సాయన్న భౌతికకాయానికి ఇంద్రాకరణ్‌రెడ్డి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు