Hyderabad News: హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ రోప్‌’.. కఠిన నిర్ణయాలు తీసుకుంటాం: సీవీ ఆనంద్‌

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌...

Published : 30 Sep 2022 01:11 IST

హైదరాబాద్‌: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. వాహనాల రద్దీని తగ్గించి నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఎస్‌హెచ్‌వోలతో ఇప్పటికే సమీక్ష నిర్వహించినట్టు వెల్లడించారు. ప్రధాన కూడళ్ల వద్ద కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కరించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.

‘‘ఆపరేషన్‌ రోప్‌(రిమూవల్‌ ఆఫ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌) పేరుతో కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నాం. హైదరాబాద్‌లో పార్కింగ్‌, ఫుట్‌పాత్‌ ఆక్రమణపై దృష్టి పెడతాం. మల్టీప్లెక్స్‌లో 60శాతం, మాల్స్‌లో 60శాతం, కమర్షియల్‌ బిల్డింగ్స్‌ 40శాతం, అపార్ట్‌మెంట్స్‌లో 30శాతం పార్కింగ్‌ కచ్చితంగా ఉండాలి. జీహెచ్‌ఎంసీతో కలిసి ఈ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తాం. అందరితో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఫుట్‌పాత్‌ని వదిలేసి రోడ్డుపైకి వచ్చి బిజినెస్‌ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆర్టీసీ బస్సులకు సంబంధించి బస్‌ బేల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తాం ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా ట్రాఫిక్‌పై దృష్టి పెడతాం. ట్రాఫిక్‌ రూల్స్‌ అందరూ పాటించేలా చూస్తాం. ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని ఉల్లంఘన కేసులు పెట్టారనేది కాకుండా ఎంతమందికి అవగాహన కల్పించామనేదే చూస్తాం. జాయింట్‌ సీపీ, డీసీపీలు కూడా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏడాదిలోగా అనుకున్న ఫలితాలు సాధిస్తాం. స్టాప్‌ లైన్‌ నియంత్రణ అనేది అందరికీ అలవాటు కావాలి.

రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా తొలగిస్తాం..

డయల్‌ 100కు 70 నుంచి 80శాతం ఫోన్లు ట్రాఫిక్‌ సమస్యలపై వస్తున్నాయి. ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ట్రాఫిక్‌ ఫ్రీ ఫ్లోను మెయింటెయిన్‌ చేయాలంటే క్యారేజ్‌ వే ఫ్రీగా ఉండాలి. అప్పుడే వాహనాల రాకపోకలు సజావుగా సాగుతాయి. కొవిడ్‌ ఇబ్బందులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీరియస్‌గా చేయడం లేదు. ఫ్రంట్‌ సీటు బెల్టుతో పాటు బ్యాక్‌ సీటు బెల్టు పెట్టుకునేలా త్వరలో అమలు చేయబోతున్నాం సోషల్‌ మీడియాను అన్ని రకాలుగా వాడుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. స్కూల్‌, కాలేజీల పరిసర ప్రాంతాల్లో మేనేజ్‌మెంట్‌లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ట్రాఫిక్‌ సిబ్బందికి 30శాతం అదనంగా అలవెన్స్‌ ఇస్తోంది. గతంలో ట్రాఫిక్‌ అంటే వద్దని వెళ్లిపోయేవారు.. కానీ, ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకొని ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించాలి, ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించవచ్చు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా త్వరలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం’’ అని సీవీ ఆనంద్‌ తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts