దా‘రుణాల’ యాప్‌లకు దూరంగా ఉండండి

ప్రస్తుత కాలంలో అప్పు పుట్టడం అంత కష్టమైన పనేమీ కాదు. వీజీగా లోన్స్‌, క్రెడిట్స్‌ ఇస్తామంటూ ఆన్లైన్‌లో ద్రవ్య సంస్థలు గాలం వేస్తున్నాయి. తర్వాత లోన్‌ రికవరీ చేసేటప్పుడు విపరీతమైన చర్యలకు పాల్పడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

Updated : 06 Dec 2022 15:02 IST


 


ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రస్తుత కాలంలో అప్పుపుట్టడం అంత కష్టమైన పనేమీ కాదు. వీజీగా లోన్స్‌, క్రెడిట్స్‌ ఇస్తామంటూ ఆన్‌లైన్‌లో ద్రవ్య సంస్థలు గాలం వేస్తున్నాయి. తర్వాత లోన్‌ రికవరీ చేసేటప్పుడు విపరీతమైన చర్యలకు పాల్పడి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అందువల్ల సులభ పద్ధతిలో వచ్చే అప్పుల విషయంలో జాగ్రత్తలు అవసరమని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో వీజీలోన్స్‌ పేరుతో మోసం చేసేందుకు అయిదు వందలకు పైగా ఫ్రాడ్‌ యాప్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. సులభంగా అప్పు వస్తుందంటే సులభంగా మోసపోయే అవకాశమూ లేకపోలేదు అంటున్నారు. మరి ఇలాంటి వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ?

ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో చాలామంది ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో అలాంటి వారి మొబైల్స్‌కు లోన్స్‌ గురించి తరచూ యాడ్‌లు వస్తున్నాయి. మేసేజ్‌ రూపంలోనూ లేదా ఏదైనా వెబ్‌సైట్‌ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు ఇలా రకరకాల రూపంలో ఇవి ఉంటున్నాయి. అయిదు నిమిషాల్లో లేదా పది నిమిషాల్లో అప్పు ఇస్తామని అందులో ఉంటుంది. అయితే ఈ యాడ్‌లు చాలావరకు చట్టవిరుద్ధంగా పనిచేసే వాటి నుంచి వచ్చేవే ఉంటాయి. యాప్‌ల పేరుతో జరిగే మోసాలే ఇందులో ఎక్కువగా ఉంటాయి.

సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌లు వంటివి అప్పులు ఇస్తుంటాయి. ఇవన్నీ చట్టరీత్యా అప్పు ఇవ్వగలిగేవి. ఏదైనా కంపెనీని ప్రారంభించి చట్టబద్ధంగా అప్పులు ఇవ్వాలంటే... ఆర్బీఐ యాక్ట్‌లో లేదా చిట్‌ఫండ్‌ యాక్ట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చట్టబద్ధంగా అప్పులు ఇచ్చే సంస్థలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటి మాదిరిగానే కనిపించే ఎన్నో ఫేక్‌యాప్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటి ఫ్రాడ్‌ యాప్‌లు దాదాపు అయిదు వందలకు పైగా గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ఇవి ఎక్కువగా యాడ్‌ బేసిస్‌ల మీద వస్తున్నాయి అని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో డబ్బుల అవసరం బాగా ఉన్నవారిని మోసం చేసేందుకు ఇవి పుట్టుకొచ్చాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఏ బ్యాంక్‌ లేదా కంపెనీ వంటివి ఏడాదికి 36 శాతం కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదు. కానీ.. ఈ యాప్‌ల ద్వారా అప్పులు ఇచ్చే వారు అధిక మొత్తంలో వడ్డీలు తీసుకుంటున్నారు. అంతేకాదు వేధింపులకు పాల్పడుతున్నారు. అప్పు తీసుకున్న వారు మహిళలు అయివుంటే లైంగిక పరమైన వేధింపులూ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో.. అప్పుతీసుకున్నవారు ఆత్మహత్యల దాకా పోతున్నారని పేర్కొంటున్నారు.

ఈ యాప్‌లు మొదటగా వినియోగదారుడి కాంటాక్ట్‌ లిస్ట్‌, ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలకు యాక్సెస్ అడుగుతాయి. యాక్సెస్‌ ఇచ్చాకే లోన్‌ తీసుకోగలుగుతారు. అంటే తెలియకుండానే మీకు సంబంధించిన అన్ని విషయాలు వారికి చేరిపోతాయన్నమాట. వాటిని ఆసరాగా చేసుకుని రికవరీల సమయంలో వేధిస్తారు. తీసుకున్న డబ్బు తిరిగి కట్టలేదని పరువు తీసే ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా వేధింపులకు గురిచేయటం చట్ట విరుద్ధం. సాధారణంగా చట్ట రీత్యా అప్పులు ఇచ్చే సంస్థలు ఏవైనా సరే డబ్బును రికవరీ చేసుకోవటంలో కొన్ని నిబంధనలు అనుసరిస్తాయి. కానీ.. ఈ ఫ్రాడ్‌ యాప్‌ల ద్వారా అప్పులు ఇచ్చేవారికి అలాంటి వేమీ ఉండవు. దాంతో దారుణాలకు పాల్పడుతున్నారు. 

ఈ యాప్‌లు చైనా బేస్‌డ్‌ అనే ప్రచారమూ సాగుతోంది. ఇవి గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి వాటిని తొలగిస్తున్నా.. మళ్లీ కొత్త వాటిని సృష్టిస్తున్నారు. చట్టరీత్యా అప్పులు ఇచ్చే సంస్థలు అయిదు పది నిమిషాల్లో అప్పులు ఇవ్వవు వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అందువల్ల అప్పు తీసుకోవటానికి ముందు వినియోగదారుడు అన్ని రకాలుగా సరిచూసుకోవటమే ఉత్తమం. సాధ్యమయినంత వరకు యాప్‌ల నుంచి ఇచ్చే రుణాలకు దూరంగా ఉండటమే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని